Suicides: ఆ బ్రిడ్జిపై ఆత్మహత్యలకు చెక్.. తక్షణ చర్యలకు ఆదేశం!
Suicides: గోదావరిపై నిర్మించిన చించినాడ బ్రిడ్జిపై వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బ్రిడ్జిపై పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
చించినాడ బ్రిడ్జిపై ఆత్మహత్యల నివారణకు చర్యలు.. 2.4 కి.మీ. మేర ఫెన్సింగ్..
బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.. తక్షణ చర్యలకు ఆదేశం..
పాలకొల్లు: గోదావరిపై నిర్మించిన చించినాడ బ్రిడ్జిపై వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బ్రిడ్జిపై పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
ఇటీవల బ్రిడ్జిపై చోటుచేసుకున్న వరుస ఆత్మహత్యల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి బుధవారం పాలకొల్లులోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ హెడ్‌వర్క్స్ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం చించినాడ గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
బ్రిడ్జిపై భద్రతకు సంబంధించిన సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన రక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు.
2.4 కిలోమీటర్ల మేర పటిష్టమైన ఫెన్సింగ్
చించినాడ బ్రిడ్జి ఆత్మహత్యలకు నిలయంగా మారడం ఆందోళన కలిగించే అంశమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు.
బ్రిడ్జికి ఇరువైపులా కలిపి 2.4 కిలోమీటర్ల పొడవునా సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బ్రిడ్జిపై ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
అదే సమయంలో ఫెన్సింగ్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని నేషనల్ హైవే అధికారులను కోరారు. గోదావరి అందాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఫెన్సింగ్ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో ఎవరూ బ్రిడ్జిపై నుంచి దూకే అవకాశం లేకుండా నిర్మాణం పటిష్టంగా ఉండాలని సూచించారు.
ఫెన్సింగ్‌కు సంబంధించి అధికారులు రూపొందించిన పలు నమూనాలు, డిజైన్లను మంత్రి పరిశీలించారు. అవసరమైతే ఎంత ఖర్చయినా భరించి ప్రజల ప్రాణాలను కాపాడేలా శాశ్వత పరిష్కారం అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
చించినాడ బ్రిడ్జి భద్రతకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీకి పలు లేఖలు రాసిన విషయాన్ని కూడా మంత్రి వెల్లడించారు.
నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలి
ఫెన్సింగ్ పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు నేషనల్ హైవే అథారిటీ రీజినల్ మేనేజర్ ఆర్.కే. సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఫెన్సింగ్ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాత్రివేళ భద్రతకు 116 లైట్లు
చించినాడ బ్రిడ్జిపై రాత్రివేళల్లో భద్రతను మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. బ్రిడ్జికి ఇరువైపులా 9 మీటర్ల ఎత్తులో మొత్తం 116 లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాత్రి సమయంలో బ్రిడ్జిపై పరిస్థితులను స్పష్టంగా పర్యవేక్షించేందుకు ఈ లైట్లు ఉపయోగపడతాయని తెలిపారు.
‘ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు’
బ్రిడ్జిపై వరుస విషాద ఘటనల నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కష్టాలు జీవితంలో తాత్కాలికమైనవేనని అన్నారు. అయితే ప్రాణం మాత్రం ఎంతో విలువైనదని గుర్తు చేశారు. సమస్యలకు ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే ప్రతి సమస్యకు ఏదో ఒక మార్గం ఉంటుందని చెప్పారు. గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకోవద్దని ప్రజలను కోరారు. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువుల గురించి ఆలోచించాలని సూచించారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం
చించినాడ బ్రిడ్జిపై ఇకపై ఎలాంటి విషాద ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. బ్రిడ్జి భద్రతకు సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, రుద్రరాజు సత్యనారాయణరాజు, నేషనల్ హైవే ఈఈ వెంకటరమణ, డీఈ శ్రీనివాస్ రావు, ఏఈఈ సబిరా, కన్జర్వెన్సీ ఈ శ్రీనివాస్, ఏఈ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Be the first to react