Nara Lokesh: ఎన్ఆర్ఐ కాదు.. ఎంఆర్ఐ.. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్!

Nara Lokesh: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తెలుగుదేశం పార్టీకి, తెలుగుజాతికి అండగా నిలవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తెలుగుజాతిని నెం.1గా నిలిపే బాధ్యతను సమిష్టిగా తీసుకుందామని, 2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.

NRI TDP Central Committee oath
NRI TDP Central Committee oath

ఎన్నారైల అండతో టీడీపీ జెండా రెపరెపలు.. 2029లో ఎన్డీయేను గెలిపించాలి: నారా లోకేశ్..

తెలుగుజాతిని నెం.1గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుందాం.. ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకారంలో మంత్రి పిలుపు..

మంగళగిరి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తెలుగుదేశం పార్టీకి, తెలుగుజాతికి అండగా నిలవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తెలుగుజాతిని నెం.1గా నిలిపే బాధ్యతను సమిష్టిగా తీసుకుందామని, 2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ అండ్ రిలేషన్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ పి. గురురాజా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఉనికి
ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదని లోకేశ్ అన్నారు. ఏ దేశానికి వెళ్లినా తెలుగులో మాట్లాడితే కనీసం 20 మంది స్పందించే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. రాజకీయాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఎన్టీఆర్.. చదువుకున్నవారికి, మేధావులకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. 

సమాజంలో మార్పు కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని లోకేశ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ తరఫున 50 శాతం స్థానాల్లో యువకులు విజయం సాధించారని చెప్పారు. ఏడుగురు ఎన్ఆర్ఐలకు కూడా పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎన్ఆర్ఐల అండ
2019–24 మధ్య రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేశ్ ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.

ఆ సమయంలో అమరావతి ఉద్యమానికి ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలిచారని చెప్పారు. కేసులు పెట్టినా వారు భయపడలేదని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు.

చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో 50 దేశాల్లోని 200 నగరాల్లో ఎన్ఆర్ఐలు కార్యక్రమాలు నిర్వహించారని లోకేశ్ చెప్పారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ కార్యక్రమం తమ కుటుంబానికి కొండంత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

ఆ సమయంలో నారా బ్రాహ్మణి ‘మనకు రాజకీయాలు అవసరమా?’ అని ప్రశ్నించారని లోకేశ్ గుర్తుచేశారు. అనంతరం ప్రజలకు మళ్లీ సేవ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

కొంతమంది ఎన్ఆర్ఐలు సుమారు 5 వేల డాలర్లు ఖర్చు చేసి ఓటు వేయడానికి రాష్ట్రానికి వచ్చారని, మరికొందరు ఉద్యోగాలకు కొన్ని నెలలు సెలవు పెట్టి గ్రామాల్లో తిరిగారని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచి ప్రజాప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములయ్యారని అన్నారు.

‘ఎన్ఆర్ఐలు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్’
ఎన్ఆర్ఐలను ‘మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్’గా లోకేశ్ అభివర్ణించారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ నమ్ముకున్న పార్టీ కోసం, తెలుగుజాతి కోసం వారు నిలబడ్డారని ప్రశంసించారు.

విదేశాల్లో ఉన్నా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారని, తెలుగుతనాన్ని మర్చిపోలేదని అన్నారు. సొంత గ్రామాలపై మమకారం, సేవాభావం ఎన్ఆర్ఐల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది వారి కమిట్‌మెంట్‌కు నిదర్శనమని లోకేశ్ అన్నారు. ఇందుకు ఎన్ఆర్ఐలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగుజాతికి ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లు
టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుజాతి కోసం పనిచేస్తుందని లోకేశ్ అన్నారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి తెలుగువారిని రక్షించామని తెలిపారు.

ఉక్రెయిన్‌పై దాడుల సమయంలోనూ చంద్రబాబు తెలుగువారికి అండగా నిలిచారని చెప్పారు. గతేడాది నేపాల్‌లో సంక్షోభం కారణంగా చిక్కుకున్న తెలుగువారిని ప్రత్యేక విమానం ద్వారా సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఎన్ఆర్ఐలు తెలుగుజాతికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని లోకేశ్ కోరారు. తెలుగుజాతిని ప్రపంచంలో నెం.1గా నిలిపేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎన్ఆర్ఐలు తాము పనిచేస్తున్న కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చేలా పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని కోరారు.

ప్రతి దేశంలో ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ
ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యత్వాన్ని విస్తరించాలని లోకేశ్ సూచించారు. ప్రతి ఒక్కరూ ‘మై టీడీపీ యాప్’తో అనుసంధానం కావాలని కోరారు. 2019–24 మధ్య అనేక మంది తటస్థ ఓటర్లకు ఫోన్ చేసి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశామని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని సూచించారు.

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ గురురాజాపై ఇప్పుడు మరింత బాధ్యత ఉందన్నారు. ఏ దేశంలో కనీసం 10 మంది తెలుగువారు ఉన్నా అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ ఉండాలని ఆకాంక్షించారు.

పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే 30 రోజుల్లో ప్రస్తుత కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కమిటీల్లో తగిన స్థానం కల్పించాలని అన్నారు.

53 రోజుల నిర్బంధాన్ని గుర్తుచేసుకుంటూ..
చంద్రబాబు అరెస్ట్ జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా లోకేశ్ పలు అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబుపై రూ.3 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారని, తర్వాత ఆ మొత్తాన్ని రూ.300 కోట్లు, ఆపై రూ.3 కోట్లుగా మార్చారని ఆరోపించారు.

చివరకు ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారని లోకేశ్ అన్నారు. ఐటీ, ఈడీ, కోర్టు నుంచి క్లీన్‌చిట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.

చంద్రబాబు అభివృద్ధి చేసిన జైలులోనే ఆయనను నిర్బంధించారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో 24 గంటలూ పోరాటం చేశామని చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో తెలుగువారు రోడ్లపైకి వచ్చి మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఆ మద్దతు తమ కుటుంబానికి కొండంత బలంగా నిలిచిందన్నారు.

53 క్యాండిల్స్ వెలిగించాలని పిలుపు
చంద్రబాబు 53 రోజుల నిర్బంధానికి గుర్తుగా 53 క్యాండిల్స్ వెలిగించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అక్రమ అరెస్ట్‌ను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇళ్లలో, సామూహికంగా నిర్వహించాలని కోరారు.

చంద్రబాబు ఎప్పుడూ తెలుగుజాతి నెం.1గా ఉండాలని ఆలోచించే నాయకుడని లోకేశ్ అన్నారు. అలాంటి నాయకుడికి అందరూ అండగా నిలవాలని కోరారు.

చివరగా, 2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు పార్టీతో అనుసంధానమై, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Tags

Be the first to react

Latest