AP Government: సామాన్యుడికి ఊరట.. ఏపీలో త్వరలోనే 1,000 మినీ మార్టుల ఏర్పాటు! ఎక్కడక్కడంటే...
-
కార్పొరేట్ స్థాయిలో మినీ మార్టులు.. రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే నిత్యావసరాలు.
-
ఏపీ రేషన్ షాపుల్లో ఇకపై 'స్టీమ్ రైస్'.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడి.
-
ఎన్సీసీఎఫ్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. సబ్సిడీ ధరలకే పంచదార, గోధుమపిండి, పామాయిల్.
AP Government: రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 1,000 మినీ మార్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కార్పొరేట్ స్థాయిలో ఉండబోయే ఈ సరికొత్త విక్రయ కేంద్రాల ద్వారా రేషన్ కార్డు దారులందరికీ అత్యంత నాణ్యమైన నిత్యావసర సరుకులను చాలా తక్కువ ధరలకే అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఈ 1,000 మినీ మార్టుల ద్వారా నిత్యం వంటకాల్లో ఉపయోగించే పంచదార, గోధుమ పిండి, మిల్లెట్స్ (చిరుధాన్యాలు), మరియు పామాయిల్ వంటి కీలకమైన వస్తువులను భారీ రాయితీతో ప్రజలకు విక్రయిస్తారు. దీంతోపాటు రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. ఇకపై సాధారణ బియ్యానికి బదులుగా రేషన్ దుకాణాల్లో నాణ్యమైన ‘స్టీమ్ రైస్’ (ఉడికించిన బియ్యం) పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త రకం బియ్యాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్ట్గా మొదట అమలు చేయనున్నారు.
పౌరసరఫరాల శాఖలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతూ విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ‘సీబీడీసీ’ (డిజిటల్ రూపాయి) వాలెట్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఈ డిజిటల్ వాలెట్ ద్వారా వినియోగదారులు నగదు రహితంగా, తమకు నచ్చిన సరుకులను అత్యంత సులభంగా కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. గత ప్రభుత్వాల హయాంలో రేషన్ కార్డులపై నాయకుల ఫోటోలు, పార్టీల రంగులు వేసి ప్రచారం చేసుకున్నారని, కానీ తమ ప్రభుత్వం కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను మరియు మళ్లింపును పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 5,354 కేసులు నమోదు చేసినట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలను పెండింగ్లో పెట్టగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు విడతల్లో రూ.1,674 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17.97 లక్షల మంది రైతుల నుంచి రూ.30,361 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేవలం 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నిధులు జమ చేశామని తెలిపారు. చిన్న, కౌలు రైతుల కోసం రూ.50 కోట్లతో ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 27,756 రేషన్ దుకాణాల ద్వారా వృద్ధులు, దివ్యాంగులైన 16.88 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు క్రమం తప్పకుండా రాయితీని అందిస్తూ పీఎన్జీ వినియోగదారులను ఆదుకుంటోందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా సామాన్య ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు.
Be the first to react