⚡ BREAKING

AP Government: ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు.. వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల బదిలీని మరింత సులభం చేస్తూ ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై రూ.100 లేదా రూ.1000 నామమాత్రపు స్టాంపు డ్యూటీతో వారసత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆటోమేటిక్గా పేర్లు మారిపోతాయి. దీనివల్ల ప్రజలు మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.

AP Government: ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు.. వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
ap government another key change in mutation of hereditary land registration
  • కేవలం రూ. 100 కే భూముల రిజిస్ట్రేషన్.. వెనువెంటనే రికార్డుల్లో పేర్ల మార్పిడి.

  • వీలునామా లేకపోయినా ఇబ్బంది లేదు: ఎఫ్ఎంసీ ఉంటే చాలు నేరుగా ఆటో మ్యుటేషన్.

  • రెవెన్యూ రంగంలో విప్లవాత్మక మార్పు.. సీసీఎల్ఏ జయలక్ష్మి కీలక ఉత్తర్వులు

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు, రైతులకు పెద్ద ఊరటనిచ్చేలా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పిడికి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారసత్వ ఆస్తుల విభజన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే, రెవెన్యూ రికార్డుల్లో కూడా దానంతట అదే పేరు మారిపోయేలా ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో తాతలు, తండ్రులు లేదా తల్లులు మరణించిన తర్వాత ఆ ఆస్తులను పంచుకోవడానికి వారసులు ఎంతో ఇబ్బంది పడేవారు. గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఎఫ్ఎంసీ) కోసం దరఖాస్తు చేసుకుని, ఆపై రెవెన్యూ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా రికార్డుల్లో పేర్లు మారేవి కావు. ఈ మానసిక ఇబ్బందులకు, అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్తో పాటే ఆటో మ్యుటేషన్ కూడా పూర్తయ్యేలా సాంకేతిక మార్పులు చేసింది.

ఈ నూతన విధానం ప్రకారం కుటుంబ పెద్దలు ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన సందర్భాల్లో, భార్యాపిల్లలు తమ ఆస్తులను పంచుకుని ఆ పంపిణీ దస్తావేజులను రిజిస్టర్ చేసే సమయంలో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే, ఆ సమాచారం నేరుగా రెవెన్యూ శాఖకు బదిలీ అవుతుంది. తద్వారా లబ్ధిదారుల పేరు మీద ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగిపోయి ప్రభుత్వ రికార్డుల్లో కొత్త యజమానుల వివరాలు నమోదవుతాయి.

ప్రభుత్వం ఇప్పటికే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ భారాలను తగ్గించడానికి నామమాత్రపు రుసుములను మాత్రమే వసూలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ చేయదలచిన భూమి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100 స్టాంపు డ్యూటీతోనే ఈ పని పూర్తవుతుంది. ఒకవేళ ఆస్తి విలువ రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీ నిర్ణయానికి తోడు ఇప్పుడు ఆటో మ్యుటేషన్ కూడా తోడవడంతో రైతులకు, గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లయింది.

ఈ విప్లవాత్మక మార్పు ద్వారా భూ వివాదాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, నిజమైన వారసులకు సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందుతాయి. ఫలితంగా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందుకోవడం ఎంతో సులభతరం కానుంది. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ, పారదర్శకమైన భూ యాజమాన్య హక్కులను ప్రజలకు చేరవేయడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Tags

Be the first to react

Latest