Tirupati: తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026కు రంగం సిద్ధం.. 26 జిల్లాల జెర్సీల ఆవిష్కరణ!
Tirupati: రాష్ట్రంలో క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలకు తిరుపతి సిద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పోటీలు పూర్తి చేసుకున్న క్రీడాకారులు ఇప్పుడు రాష్ట్రస్థాయి వేదికపై తమ సత్తా చాటనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన 26 జిల్లాల జెర్సీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ఆవిష్కరించారు.
మట్టిలో మాణిక్యాల కోసం అమరావతి ఛాంపియన్‌షిప్.. 2.07 లక్షల మంది క్రీడాకారుల భాగస్వామ్యం..
తిరుపతిలో రేపటి నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్.. విజేతలకు రూ.91.90 లక్షల బహుమతులు..
తిరుపతి: రాష్ట్రంలో క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలకు తిరుపతి సిద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పోటీలు పూర్తి చేసుకున్న క్రీడాకారులు ఇప్పుడు రాష్ట్రస్థాయి వేదికపై తమ సత్తా చాటనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన 26 జిల్లాల జెర్సీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ఆవిష్కరించారు.
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఉమా, ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడుతో కలిసి రవి నాయుడు జెర్సీలను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మట్టిలో మాణిక్యాలను గుర్తించడమే లక్ష్యం
అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రధాన ఉద్దేశం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదిక కల్పించడమేనని రవి నాయుడు తెలిపారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోటీలను నిర్వహించామని చెప్పారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జరిగిన పోటీల్లో 2,07,498 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో 83,650 మంది పోటీపడ్డారని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిలో 9,911 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు 12 క్రీడాంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
రేపు రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీకారం
అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభోత్సవం ఆగస్టు 24న ఉదయం 9 గంటలకు జరగనుంది. హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రవాణా, క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్, ఎస్పీ, జేసీ, విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొననున్నారు. మంత్రులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడల్లో పాల్గొననున్నారు.
రూ.91.90 లక్షల నగదు బహుమతులు
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు ఆగస్టు 29న రూ.91.90 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు రవి నాయుడు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలలకు విస్తరణ
గత ఏడాది అమరావతి ఛాంపియన్‌షిప్‌లో సుమారు 28 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని రవి నాయుడు గుర్తుచేశారు. ఈ ఏడాది మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ప్రతి పాఠశాల, కళాశాలలో పోటీలు నిర్వహించేలా కార్యక్రమాన్ని విస్తరించామని తెలిపారు.
అండర్–17 విభాగంలో బాలబాలికలకు, అండర్–23 విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రవి నాయుడు చెప్పారు.
సీఎం లక్ష్యానికి అనుగుణంగా ‘క్రీడాంధ్రప్రదేశ్’
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో అమరావతి ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమం కేవలం క్రీడా పోటీ కాదని, రాష్ట్రాన్ని ‘క్రీడాంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే మహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా శాప్ పనిచేస్తోందన్నారు.
ఆగస్టు నెలను భవిష్యత్తులో స్వాతంత్ర్య వేడుకలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా క్రీడల మాసంగా నిర్వహించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం అనే విషయంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రూ.16 కోట్ల పెండింగ్ బకాయిలు క్లియర్
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.16 కోట్ల క్రీడా ప్రోత్సాహక బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని రవి నాయుడు తెలిపారు. అదనంగా సుమారు రూ.8 కోట్లు అందించామని చెప్పారు.
ఆగస్టు 29న మరో రూ.9 కోట్ల మేర క్రీడా ప్రోత్సాహకాలను అర్హులైన క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందన్నారు.
తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారంటే..
రాష్ట్రస్థాయి పోటీలకు తిరుపతిని ఎంపిక చేయడానికి ఇక్కడ ఉన్న మౌలిక వసతులే ప్రధాన కారణమని రవి నాయుడు వివరించారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత తిరుపతిని ఎంపిక చేశామని చెప్పారు. తిరుపతిలో ఏడు విశ్వవిద్యాలయాలతో పాటు అనేక క్రీడా మైదానాలు, కోచ్‌లు, రిఫరీలు, గ్రౌండ్ మేనేజర్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి సుమారు 14 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది తిరుపతికి రానున్నారు. వారికి వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చేయడం పెద్ద సవాలేనని, అయితే జిల్లా యంత్రాంగం, టీటీడీ పూర్తి సహకారం అందిస్తున్నాయని రవి నాయుడు చెప్పారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి: జేసీ గోవిందరావు
రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా, వైద్య సేవలు, భద్రత వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలు గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
క్రీడల్లో బాలికలు ముందుకు రావాలి: వీసీ ఉమా
అమరావతి ఛాంపియన్‌షిప్‌కు తిరుపతి వేదిక కావడం గర్వకారణమని పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఉమా అన్నారు. క్రీడాకారులకు మైదానాలు, వసతి, ఇతర సదుపాయాల కల్పనలో తమ విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలకు కీలక స్థానం ఉందని, ముఖ్యంగా బాలికలు క్రీడల్లో మరింతగా పాల్గొని ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించేలా ఈ ఛాంపియన్‌షిప్ ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.
ఎస్వీ యూనివర్సిటీ పూర్తి సహకారం
రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు ఎస్వీ యూనివర్సిటీ పూర్తి సహకారం అందిస్తోందని రిజిస్ట్రార్ భూపతి నాయుడు తెలిపారు. క్రీడా మైదానాలు, వసతి, శిక్షణకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచామని చెప్పారు.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా ఎస్వీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారని గుర్తుచేశారు.
క్రీడాకారులకు అండగా ప్రభుత్వం
శాప్ బోర్డు సభ్యురాలు, డబుల్ ఒలింపియన్ ఈ. రజిని మాట్లాడుతూ, తాను కూడా తిరుపతిలో విద్యాభ్యాసం పూర్తి చేసి క్రీడల్లో రాణించిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో క్రీడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శాప్, క్రీడాశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
మీడియా సహకారం కోరిన శాప్ చైర్మన్
అమరావతి ఛాంపియన్‌షిప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని రవి నాయుడు అన్నారు. 26 జిల్లాల నుంచి వేలాది మంది క్రీడాకారులు తిరుపతికి వస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు, కెమెరామెన్లు, బ్యూరో ప్రతినిధులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. “అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడాకారుల పండుగగా మారాలి” అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ భారీ క్రీడా వేడుకకు తిరుపతి వేదిక కావడంతో రాష్ట్రంలోని యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది.
Tags
Be the first to react