AP Govt: 100కు పైగా పుణ్యక్షేత్రాలకు రహదారి బాట.. రూ.120 కోట్లతో 205 కి.మీ. రోడ్లు!

AP Govt: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అనుసంధాన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు.

100కు పైగా పుణ్యక్షేత్రాలకు రహదారి బాట..
100కు పైగా పుణ్యక్షేత్రాలకు రహదారి బాట..

ఏపీలో ఆలయాలకు రోడ్ల మహా అనుసంధానం.. 26 రహదారుల నిర్మాణం పూర్తి..

అహోబిలం, అంతర్వేది సహా ప్రముఖ క్షేత్రాలకు కొత్త రోడ్లు..

అమరావతి: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అనుసంధాన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ప్రధాన పుణ్యక్షేత్రాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మొత్తం రూ.120 కోట్ల వరకు నిధులు కేటాయించారు.

భక్తుల ఇబ్బందులకు పరిష్కారం
రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాడపల్లి వంటి పుణ్యక్షేత్రాలకు రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యలను క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించిన పవన్ కళ్యాణ్‌కు పలువురు ప్రజలు వినతిపత్రాలు కూడా అందించారు.

దీంతో దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారులు నిర్మించాలని ఆయన నిర్ణయించారు. బడులు, ఆలయాలు, ఆసుపత్రులు, పంట పొలాలకు వెళ్లే మార్గాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.

రూ.120 కోట్లతో రహదారుల నిర్మాణం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ-జీ రామ్-జీ, సాస్కీ తదితర నిధులను ఉపయోగించి ఈ రహదారి పనులు చేపడుతున్నారు. మొత్తం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 26 రహదారుల నిర్మాణం పూర్తయింది. మరో 40 శాతం రహదారుల పనులు దాదాపు 50 శాతం మేర పూర్తయ్యాయి. పూర్తయిన రోడ్లను త్వరలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నరసింహ క్షేత్రాలకు ప్రత్యేక అనుసంధానం
ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రముఖ ఆలయాలకు రహదారి సౌకర్యం అందుతోంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం వంటి క్షేత్రాలకు రోడ్ల నిర్మాణం చేపట్టారు.

అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి సమీపంలోని పుడియగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గంలోని సింగిరికోన, సోమేశ్వరం, తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్. జగన్నాథపురం ఘాట్ రోడ్లు కూడా పూర్తయ్యాయి.

వాడపల్లి కరకట్ట నుంచి అర్థగిరి వరకు
సాస్కీ నిధులతో కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం అభివృద్ధి చేస్తున్నారు. రూ.3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయ రహదారి నిర్మాణం చేపట్టారు.

తెనాలి, రాయచోటి తదితర నియోజకవర్గాల్లోని ఆలయ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. నిడదవోలులో ఆంజనేయస్వామి ఆలయ రహదారి, పూతలపట్టు నియోజకవర్గంలోని తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయ రహదారి పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి.

సత్యసాయి జిల్లాకు రూ.30 కోట్లు
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన దాదాపు 72 కిలోమీటర్ల రహదారుల పనులు కూడా వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

రహదారుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి
ఆలయాలకు నిర్మిస్తున్న రోడ్ల విషయంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. భక్తులు దీర్ఘకాలం ఉపయోగించుకునేలా రహదారులను నిర్మించాలని సూచించారు.

పూర్తయిన ఆలయ రహదారుల నాణ్యతను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, అనంతరం వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం
ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమిచ్చేలా మరిన్ని ఆలయాలను రహదారులతో అనుసంధానించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

ఆలయం ఎంత ముఖ్యమో.. అక్కడికి చేరుకునే దారి కూడా అంతే ముఖ్యమనే భావనతో చేపడుతున్న ఈ రహదారి పనులు పూర్తయితే పుణ్యక్షేత్రాలకు భక్తుల రాక మరింత సులభం కానుంది.

Tags

Be the first to react

Latest