Forests: అడవుల పునరుద్ధరణకు డ్రోన్ టెక్నాలజీ.. 20 వేల హెక్టార్లలో సీడ్ బాల్స్ విస్తరణ!

Forests: ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీడ్ బాల్స్ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించిన 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించే దిశగా అటవీ శాఖ చర్యలు ముమ్మరం చేసింది.

అడవుల పునరుద్ధరణకు డ్రోన్ టెక్నాలజీ
అడవుల పునరుద్ధరణకు డ్రోన్ టెక్నాలజీ

50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యమే టార్గెట్.. ఏపీలో 2 కోట్లకు పైగా సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రభుత్వం..

అడవుల పునరుద్ధరణకు వేగంగా సీడ్ బాల్స్‌.. 20,929 హెక్టార్లలో 2.06 కోట్ల విత్తన బంతుల విస్తరణ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీడ్ బాల్స్ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించిన 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించే దిశగా అటవీ శాఖ చర్యలు ముమ్మరం చేసింది.

ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యంలో సుమారు 85 శాతం మేర సీడ్ బాల్స్ విస్తరణ పూర్తయింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇప్పటివరకు సుమారు 2.06 కోట్ల సీడ్ బాల్స్‌ను 20,929 హెక్టార్లలో వెదజల్లారు.

3 కోట్ల సీడ్ బాల్స్ లక్ష్యం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మూలపాడు ఎకో పార్క్‌లో తొలి సీడ్ బాల్‌ను తయారు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో మొత్తం 2.82 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేశారు.

స్వదేశీ, బహుళ ప్రయోజనకరమైన వృక్ష జాతుల విత్తనాలతో ఈ సీడ్ బాల్స్‌ను తయారు చేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగాన్ని క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పచ్చదనాన్ని తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ సీజన్‌లో 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్‌ను వెదజల్లాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

డ్రోన్లతో అడవుల్లోకి విత్తనాలు
అడవుల్లోని కొన్ని ప్రాంతాలకు మనుషులు చేరుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో వృక్ష సంపద తగ్గిన ప్రాంతాలను గుర్తించడం కూడా సవాలుగా మారుతుంది. ఈ సమస్యకు అటవీ శాఖ డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది.

వర్షపాతం మెరుగుపడిన ప్రాంతాలను గుర్తించి, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తగిన విత్తనాలను ఎంపిక చేస్తున్నారు. అనంతరం డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్‌ను ఆయా ప్రాంతాల్లో విస్తరిస్తున్నారు. దీంతో మానవ వనరులు సులభంగా చేరుకోలేని ప్రాంతాల్లోనూ పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఏర్పడింది.

ఏడు జిల్లాల్లో విస్తృతంగా కార్యక్రమం
తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమం విస్తృతంగా కొనసాగింది. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సీడ్ బాల్స్ తయారీ, వాటి రవాణా, విస్తరణలో కీలకంగా పాల్గొంటున్నారు.

అటవీ ప్రాంతాల సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అటవీ సిబ్బంది, స్థానిక ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లారు.

మొలకలపై కూడా ప్రత్యేక దృష్టి
సీడ్ బాల్స్ వెదజల్లడంతో కార్యక్రమం పూర్తయినట్లుగా భావించకుండా, ఆ తర్వాతి దశపై కూడా అటవీ శాఖ దృష్టి పెట్టాలని మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. వెదజల్లిన ప్రాంతాల్లో మొలకెత్తిన విత్తనాల శాతం, మొక్కల ఎదుగుదల, వాటి మనుగడ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

సీడ్ బాల్స్ కార్యక్రమం మరో మైలురాయిని చేరుకోవడంపై ఇందులో భాగస్వాములైన అటవీ శాఖ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను పవన్ కళ్యాణ్ అభినందించారు. అడవుల పునరుద్ధరణతో పాటు రాష్ట్రంలో పచ్చదనం పెంచి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించడంలో సీడ్ బాల్స్ కార్యక్రమం కీలకంగా మారుతుందని అటవీ శాఖ భావిస్తోంది.

Tags

Be the first to react

Latest