Amaravathi: రాజధాని అమరావతిలో తొలిసారి స్వాతంత్ర్య వేడుకలు.. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం!
Amaravathi: ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడిలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
2047 లక్ష్యంగా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర.. సీఎం చంద్రబాబు కీలక సందేశం..
‘నా దేశం.. నా బాధ్యత’.. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పిలుపు..
అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడిలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక మాత్రమే కాదని, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని సీఎం చంద్రబాబు అన్నారు. అది దేశ ఐక్యతకు చిహ్నమని, భవిష్యత్తుకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం ఒక్కరోజులో, ఒక్కరి పోరాటంతో సాధించినది కాదని చంద్రబాబు అన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానాలు, అమరుల ప్రాణత్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు.
స్వాతంత్ర్య సమరంలో తెలుగు నేల కూడా తనదైన ముద్ర వేసిందని తెలిపారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు నేలకు గర్వకారణమని అన్నారు.
దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిందని.. ఇప్పుడు దేశానికి మనం ఏం చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘నా దేశం.. నా బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు.
2047 నాటికి భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కూడా నంబర్ వన్‌గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే 20 ఏళ్ల పాటు లక్ష్య సాధన కోసం కష్టపడేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.
జాతీయ జెండా చేతిలో ఉండటంతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. చేసే ప్రతి పని దేశ భవిష్యత్తు, సమాజ హితం కోసం ఉండాలని సూచించారు.
విద్యార్థులు తమ నైపుణ్యాలతో కొత్త ఆవిష్కరణలు చేయాలని, రైతులు ప్రకృతి సాగు ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు భూసారాన్ని కాపాడాలని అన్నారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సామాజిక బాధ్యతను నెరవేర్చాలని సూచించారు.
మహిళలు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని సీఎం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని నిర్దేశించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకుందని చెప్పారు. ఈ రెండు లక్ష్యాలు వేర్వేరు కాదని.. వికసిత్ భారత్‌కు బలమైన రాష్ట్రం అవసరమని, స్వర్ణాంధ్రకు బలమైన దేశం అవసరమని సీఎం వివరించారు.
అందరూ ఐక్యంగా, బాధ్యతతో పనిచేసి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని పిలుపునిచ్చారు. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయించే స్థాయికి భారత్ ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని చంద్రబాబు అన్నారు. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగిందని గుర్తుచేశారు.
ప్రతిసారీ సవాళ్లు, సంక్షోభాలు మారినా.. వాటిని ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచిందని పేర్కొన్నారు. విభజన తర్వాత ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని చెప్పారు.
2019లో అధికారంలోకి వచ్చిన పాలకులు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆ కాలంలో రాష్ట్రం చీకటి రోజులను చూసిందని, వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. గత పాలకుల అవినీతి, అసమర్థత కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు.
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని చంద్రబాబు అన్నారు. ‘ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి’ అనే ఆకాంక్షతో ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
ఆ తీర్పును అధికారంగా భావించలేదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు అప్పగించిన బాధ్యతగా స్వీకరించామని సీఎం తెలిపారు. పాలకులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తొలి సంతకం నుంచే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నిజమైన అర్థం చెప్పేలా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల్లో ప్రజలకు మార్పు కనిపించేలా పనిచేశామని చంద్రబాబు తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడం ప్రతి పౌరుడి కర్తవ్యమని చంద్రబాబు తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.
Tags
Be the first to react