అనంతపురం మీదుగా ప్రయాణించే పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టైమ్‌టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వందేభారత్, కొండవీడు ఎక్స్‌ప్రెస్ సహా పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రయాణికులు పాత సమయాలను నమ్మకుండా కొత్త షెడ్యూల్‌ను గమనించాలని అధికారులు సూచించారు.
యశ్వంతపూర్ – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17212) అనంతపురం చేరుకునే సమయం ముందుకు మార్చారు. గతంలో ఈ రైలు సాయంత్రం 6.38 గంటలకు స్టేషన్‌కు వచ్చేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు సాయంత్రం 4.28 గంటలకే అనంతపురం చేరుకుని, 4.30 గంటలకు మచిలీపట్నం వైపు బయలుదేరుతుంది.
బెంగళూరు – కలబురిగి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22232) కూడా ముందుగానే చేరుకుంటుంది. ఈ రైలు గతంలో సాయంత్రం 5.58 గంటలకు అనంతపురం వచ్చేది. ఇకపై సాయంత్రం 5.33 గంటలకు చేరుకుని, రెండు నిమిషాల తర్వాత 5.35 గంటలకు కలబురిగి వైపు ప్రయాణం కొనసాగిస్తుంది. అలాగే బెంగళూరు – ఢిల్లీ రైలు (12627) అనంతపురం నుంచి రాత్రి 11.30కి బదులుగా 11.15 గంటలకే బయలుదేరుతుంది.
కొన్ని ప్యాసింజర్ రైళ్ల సమయాల్లో కూడా మార్పులు చేశారు. తిరుపతి – కదిరి దేవరపల్లి రైలు (57405) ఉదయం 6.30కి బదులుగా 6.00 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి – గుంతకల్లు రైలు (57403) మధ్యాహ్నం 12.50కి బదులుగా 1.50 గంటలకు బయలుదేరనుంది. గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే రైలు (57404) ఉదయం 9.15కి బదులుగా 9.00 గంటలకు అనంతపురం నుంచి బయలుదేరుతుంది.
అదే విధంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. ధర్మవరం – మచిలీపట్నం రైలు (17216) సాయంత్రం 5.55కి బదులుగా 6.20 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) కూడా సాయంత్రం 6.15కి బదులుగా 6.30 గంటలకు అనంతపురం నుంచి బయలుదేరనుంది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.