సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక యోచనను ముందుకు తీసుకొచ్చింది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో లక్షల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ జిల్లాల వైపు కదలడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి తీవ్ర రద్దీకి లోనవుతోంది. ముఖ్యంగా పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతూ, గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఫాస్టాగ్ విధానం అమల్లో ఉన్నప్పటికీ పండుగ రద్దీ ముందు అది పూర్తిగా ఉపయోగపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సంక్రాంతి పండుగ రోజుల్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్–విజయవాడ హైవేపై టోల్ రుసుములను మినహాయించే అంశాన్ని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం అనుమతి అవసరం కావడంతో, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ హైవేపై విస్తరణ పనులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే రహదారి మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని, అత్యవసర సేవల వాహనాలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే పండుగ రోజుల్లో టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా నిరంతరంగా సాగేందుకు ఈ టోల్ ఫ్రీ ప్రయాణ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్ శాఖ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, ట్రాఫిక్ నిపుణులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
సమావేశంలో ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, పోలీస్ బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం గనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే, ఈసారి సంక్రాంతి ప్రయాణం లక్షలాది మందికి సౌకర్యవంతంగా మారనుంది. అదే సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల మంచి స్పందన వచ్చే అవకాశమూ ఉంది. మొత్తంగా చూస్తే, పండుగ వేళ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అమలైతే, హైదరాబాద్–విజయవాడ హైవే పై ప్రయాణించే వారికి ఇది పెద్ద ఊరటగా మారనుందని చెప్పవచ్చు.