ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని ఆశిస్తున్న వైద్యులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన వైద్యులకు ప్రభుత్వ సేవలోకి ప్రవేశించే అరుదైన అవకాశం లభిస్తుంది.
ఈ నియామకాలను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (Andhra Pradesh Medical Services Recruitment Board) నిర్వహిస్తుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ (APMSRB) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. క్లినికల్, నాన్-క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో బోధనా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియామకాలు వైద్య విద్యా రంగానికి బలాన్నిచ్చేలా ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 8, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 22, 2026 రాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది.
ఈ పోస్టులు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక విభాగాల్లో ఉన్నాయి. అంతేకాకుండా పలు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కూడా నియామకాలు చేపట్టనున్నారు. దీంతో వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వీలుంది.
విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో MD, MS, DNB, DM లేదా MCh పూర్తి చేసి ఉండాలి. ఇవన్నీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఉండాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అవసరమైన పని అనుభవం కూడా తప్పనిసరి. యువ వైద్యులతో పాటు అనుభవజ్ఞులైన డాక్టర్లకు కూడా ఈ ఉద్యోగాలు (DME Andhra Pradesh Jobs) అందుబాటులో ఉన్నాయి.
వయోపరిమితి జూలై 1, 2025 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగ అభ్యర్థులకు మరింత సడలింపు ఇచ్చారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.2,000గా, రిజర్వుడ్ కేటగిరీలకు రూ.1,500గా నిర్ణయించారు.
ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పూర్తిగా అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, మెరిట్ ఆధారంగానే ఎంపిక జరగనుంది. అవసరమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ.68,900 నుంచి గరిష్ఠంగా రూ.2,05,500 వరకు జీతం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు, వైద్య విద్యా రంగంలో గౌరవప్రదమైన సేవ చేసే అవకాశం ఈ ఉద్యోగాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.