నైరుతి బంగాళాఖాతంలో( Bay of Bengal Cyclone) ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. సముద్రంపై ఏర్పడిన ఈ వాతావరణ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరానికి దగ్గరవుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే శుక్రవారం నాటికి ఇది పూర్తిస్థాయి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు, చలితో కూడిన వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ వాయుగుండం బంగాళాఖాతం మధ్యభాగంలో బలంగా కేంద్రీకృతమై ఉంది. గురువారం సాయంత్రానికి ఇది శ్రీలంక తూర్పు తీరంలోని పలు ప్రాంతాలకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు (IMD Weather Update) అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ నేడు ఉదయం లేదా మధ్యాహ్నం నాటికి తుపానుగా బలపడవచ్చని అంచనా. అలా జరిగితే దీనికి ‘ఓర్ణబ్’ (ORNOB)అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించగా, సముద్రానికి సంబంధించిన అర్థం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తుపానుగా మారిన తర్వాత ఇది వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక తూర్పు తీరాన్ని దాటే అవకాశముందని అంచనా. ముఖ్యంగా పొట్టువిల్ నుంచి ట్రింకోమలి మధ్య ప్రాంతంలో తీరం దాటే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో గాలులు వేగంగా వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఈ వాయుగుండం ప్రభావం (Cyclone Warning AP) ఆంధ్రప్రదేశ్‌పై కూడా కొంతమేర కనిపించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం కొనసాగడంతో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు (Andhra Pradesh) రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉదయం వేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల లోపే నమోదవడం గమనార్హం.