ఆధార్ కార్డు ప్రస్తుతం దేశంలోని ప్రతి పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా నిలిచింది. పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, సబ్సిడీలు, ప్రయోజనాలు—ఏ విషయంలోనైనా ఆధార్ అవసరమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో కూడా ఆధార్ కార్డు వెంట ఉండటం ఎంత ముఖ్యం అనేది ప్రతిరోజూ మనం అనుభవిస్తున్నాం. ఈ నేపథ్యంలో టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా ఆధార్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తూ, ప్రజలకు మరింత సులభతరం చేసే మార్గాలను UIDAI అన్వేషిస్తోంది. గతంలో ఆధార్ అప్‌డేషన్‌ను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తూ, ప్రజల పనులను గణనీయంగా సులభతరం చేసింది.
ఇప్పుడు అదే దిశగా మరింత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ, ఇంటి నుంచే మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ మార్పు కోసం తప్పనిసరిగా సమీప ఆధార్ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్‌కు ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెడుతూ UIDAI ఆధార్ యాప్‌లో కొత్త “మొబైల్ నెంబర్ అప్‌డేట్” ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్‌తో పాటు ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్‌ను కలిపి, పూర్తిగా సురక్షితమైన టెక్నాలజీతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది.
ఇంటి వద్ద నుంచే మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడానికి అవసరమైన ప్రక్రియ కూడా చాలా సులభం. కొత్తగా అప్‌డేట్ చేసిన UIDAI అధికారిక ఆధార్ యాప్‌ను ఓపెన్ చేసి, అందులోని "మొబైల్ అప్‌డేషన్" ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. అక్కడ మీ కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి. నమోదు చేసిన వెంటనే ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత, యాప్ మీ ఫోన్ కెమెరా ద్వారా ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఫేస్ ఆథెంటికేషన్ పూర్తయ్యాక, మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్‌గా ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది. మొత్తం ప్రక్రియను యూజర్ ఫ్రెండ్లీగా, చాలా తక్కువ సమయంలో పూర్తి చేసుకునేలా UIDAI డిజైన్ చేసింది.
సమాచారం ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి టెస్టింగ్ మోడ్‌లో అందుబాటులో ఉంది. వారికి ఈ సదుపాయం ఎలా పనిచేస్తుందో, యాప్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వివరించి తమ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని UIDAI కోరింది. త్వరలోనే ఈ సేవను దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సౌకర్యం ప్రారంభమైతే ఆధార్ అప్‌డేషన్ సర్వీస్ పూర్తిగా సులభతరం అవుతుంది. ఇకపై మొబైల్ నెంబర్ మార్పు కోసం సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం ప్రతికుండా, ఇంటి నుంచే కొన్ని నిమిషాల్లో అప్‌డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది ప్రజలకు గణనీయమైన సమయం ఆదాకి దారితీస్తుంది.