థ్యాంక్స్‌ గివింగ్ వేళ తానా సేవా స్ఫూర్తి.. ఎడిసన్‌లో పేద కుటుంబాలకు ఆహార సాయం!

Thanksgiving Special: అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ బృందం సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానికంగా ఆహార సహాయం అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా శనివారం న్యూజెర్సీలోని ఎడిసన్ పట్టణంలో ఉన్న ‘హ్యాండ్స్ ఆఫ్ హోప్’ కేంద్రంలో వందలాది కుటుంబాలకు ఆహార సామగ్రిని పంపిణీ చేసింది. పండుగ వేళ ప్రతి కుటుంబం ఆనందంగా విందు చేసుకునేలా అవసరమైన సరుకులను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

TANA Food Distribution in Edison
TANA Food Distribution in Edison

అమెరికాలో తానా సేవా కార్యక్రమం.. న్యూజెర్సీలో వందలాది కుటుంబాలకు ఆహార కిట్ల పంపిణీ..

అమెరికన్ పండుగలో తెలుగు సేవా భావం.. న్యూజెర్సీలో తానా బృందం ప్రశంసనీయ కార్యక్రమం..

అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ బృందం సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానికంగా ఆహార సహాయం అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా శనివారం న్యూజెర్సీలోని ఎడిసన్ పట్టణంలో ఉన్న ‘హ్యాండ్స్ ఆఫ్ హోప్’ కేంద్రంలో వందలాది కుటుంబాలకు ఆహార సామగ్రిని పంపిణీ చేసింది. పండుగ వేళ ప్రతి కుటుంబం ఆనందంగా విందు చేసుకునేలా అవసరమైన సరుకులను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

అమెరికన్ సంప్రదాయంలో థ్యాంక్స్‌గివింగ్ రోజున కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ప్రత్యేక విందు చేసుకుంటారు. ఈ విందులో టర్కీ ప్రధాన వంటకంగా ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని తానా బృందం ఒక్కో కుటుంబానికి టర్కీతో పాటు చికెన్, ఇతర నిత్యావసర సరుకులతో కూడిన ఆహార కిట్‌ను అందించింది. ఒక్కో కిట్ విలువ సుమారు 100 డాలర్లు. ఆహార కిట్లతో పాటు కార్యక్రమానికి వచ్చిన వారికి వేడివేడి భోజనాలను కూడా వడ్డించారు. పండుగ రోజున ఆహార కొరత కారణంగా ఏ కుటుంబమూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించారు.

ఈ సేవా కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఎడిసన్ హైస్కూల్, సౌత్ బ్రన్స్‌విక్ హైస్కూల్‌లకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆహార కిట్లు, భోజనాల పంపిణీలో సహకరించారు. తానా యువ వాలంటీర్లు అనిత్ రాంపురం, వంశీ చంద్ నరేపలేపు విద్యార్థులను సమన్వయం చేశారు. చిన్న వయసు నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.

తానా న్యూజెర్సీ బృందం పండుగలకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పాఠశాల విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు, అవసరమైన విద్యా సామగ్రిని అందించడం, ఆహార సహాయం అవసరమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, భోజనాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది. అంతేకాకుండా స్థానిక సంఘాలు చేపట్టే సేవా కార్యక్రమాల్లోనూ తానా వాలంటీర్లు భాగస్వాములై నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి తానా అందిస్తున్న సేవలను ఎడిసన్ స్థానిక నాయకులు, న్యూజెర్సీ రాష్ట్ర నాయకులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో తానా నాయకులు, సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేశారు. తానా కోశాధికారి రాజా కాసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నరేపలుపు, యువజన సమన్వయకర్త శ్రీనివాస్ చెరుకూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. ప్రవీణ్ రెడ్డి కల్వకొల్లు, రవి మాచర్ల కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. సుధీర్ రాంపురం, హరీష్ కోయ, సుందర్ గోపీనాథ్, సతీష్ మాక, మూర్తి వాలంటీర్లుగా పాల్గొని ఆహార కిట్లు, భోజనాల పంపిణీలో తమ సేవలు అందించారు.

థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా న్యూజెర్సీ బృందాన్ని తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు అభినందించారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులు, వాలంటీర్ల కృషిని ప్రశంసించారు.

తెలుగు సమాజం తాము నివసిస్తున్న ప్రాంతంలోని స్థానిక అమెరికన్ సమాజంతో కలిసిమెలిసి ఉండటంతో పాటు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలన్నది తానా లక్ష్యం. ముఖ్యంగా తెలుగు పిల్లలు, యువత చిన్ననాటి నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తి పెంచుకుని, తమ చుట్టూ ఉన్న సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా తానా ప్రోత్సహిస్తోంది. థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా న్యూజెర్సీలో నిర్వహించిన ఈ ఆహార పంపిణీ కార్యక్రమం ఆ లక్ష్యానికి మరో ఉదాహరణగా నిలిచింది. పండుగ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ, సేవా భావాన్ని తర్వాతి తరాలకు అందించడంలో తానా చేస్తున్న కృషి ప్రశంసనీయం.

Tags

Be the first to react

Latest