Visakhapatnam Airport: విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వీడ్కోలు.. అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి విమాన సేవలు!

Visakhapatnam Airport: ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో విశాఖపట్నం నుంచి నడుస్తున్న షెడ్యూల్డ్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సేవలు భోగాపురం కొత్త విమానాశ్రయానికి మారనున్నాయి.

Visakhapatnam Airport
Visakhapatnam Airport

ఆగస్టు 17 నుంచి VTZ కోడ్‌తో కొత్త విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు.. 

విశాఖ నుంచి చివరి ఇండిగో విమానం రాత్రి 10.45 గంటలకు..

విజయనగరం: ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (ASRI) ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో విశాఖపట్నం నుంచి నడుస్తున్న షెడ్యూల్డ్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సేవలు భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 17 నుంచి ASRI విమానాశ్రయం VTZ అనే IATA కోడ్‌తో కార్యకలాపాలు నిర్వహించనుంది.

భోగాపురం విమానాశ్రయానికి విమాన సేవల బదిలీ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల కార్యకలాపాలకు నేటితో ముగింపు పలకనున్నారు.

విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లే చివరి ఇండిగో విమానం 6E 2018 రాత్రి 10.45 గంటలకు బయలుదేరనుంది. ఈ విమానంతో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ వాణిజ్య ప్రయాణికుల సేవలు ముగియనున్నాయి.

అర్ధరాత్రి దాటిన తర్వాత VTZ కోడ్ భోగాపురం విమానాశ్రయానికి బదిలీ అవుతుంది. అనంతరం కొత్త విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అయితే విశాఖపట్నం విమానాశ్రయంలో నాన్‌షెడ్యూల్డ్ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని విమానాశ్రయ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు.

GMR AERO శుక్రవారం విడుదల చేసిన మార్పిడి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే ప్రయాణికుల షెడ్యూల్డ్ విమాన సేవలు భోగాపురంలోని ఇంటిగ్రేటెడ్ విమానాశ్రయం నుంచే కొనసాగుతాయి.

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సేవలకు ఒకే విమానాశ్రయం కేంద్రంగా మారనుంది. దీంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది.

కొత్త విమానాశ్రయంలో విమానయాన భద్రతా బాధ్యతలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) స్వీకరించింది. CISF డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ విమానాశ్రయంలో నిర్వహించిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని భద్రత, కార్యకలాపాలకు సంబంధించిన ప్రోటోకాల్‌ను అధికారికంగా స్వీకరించనున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు CISF, GMR AERO ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

భోగాపురం విమానాశ్రయాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (GVIAL) అభివృద్ధి చేసింది. ప్రయాణికుల సౌకర్యం, వేగవంతమైన కార్యకలాపాలు, భవిష్యత్ విస్తరణకు అనుగుణంగా విమానాశ్రయాన్ని రూపొందించారు.

కొత్త విమానాశ్రయంలో 77,342 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ నిర్మించారు. ఇందులో చెక్-ఇన్, భద్రతా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్, బ్యాగేజీ, బోర్డింగ్ వంటి అన్ని సేవలు ఒకే టెర్మినల్‌లో అందుబాటులో ఉంటాయి.

ప్రయాణికుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు డిజియాత్ర, ఈ-గేట్లు, సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అధునాతన బ్యాగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థతో లగేజీ తరలింపును మరింత సమర్థంగా నిర్వహించనున్నారు.

విమానాశ్రయం ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీనిని 4 కోట్లకు పైగా ప్రయాణికుల సామర్థ్యానికి విస్తరించుకునేలా ప్రణాళిక రూపొందించారు.

విమానాశ్రయంలో 3,800 మీటర్ల Code 4E రన్‌వే, సమాంతర ట్యాక్సీవే, ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలు, 18 విమానాల పార్కింగ్ స్టాండ్లు ఉన్నాయి. భవిష్యత్తులో విమాన సర్వీసులు పెరిగినా వాటిని నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీ పెరగడంతో పర్యాటకం, కార్గో, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి భోగాపురానికి షెడ్యూల్డ్ విమాన సేవల మార్పు కేవలం విమానాశ్రయ మార్పు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దశకు నాంది పలకనుంది.

Tags

Be the first to react

Latest