Crop Insurance: ఏపీ పంటల బీమా 2026.. 35.17 లక్షలకు చేరిన దరఖాస్తులు.. 80 శాతం పెరుగుదల!
Crop Insurance: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన రైతుకూ పంటల బీమా రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పంటల బీమాపై తప్పుడు ప్రచారం చేసి రైతుల్లో అపోహలు సృష్టించవద్దని ఆయన సూచించారు.
పంటల బీమాపై తప్పుడు ప్రచారం వద్దు.. రైతుల రక్షణే ప్రభుత్వ లక్ష్యం: అచ్చెన్నాయుడు..
ఖరీఫ్–2026లో 35.17 లక్షల బీమా దరఖాస్తులు.. గతేడాదితో పోలిస్తే 80 శాతం పెరుగుదల..
అమరావతి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన రైతుకూ పంటల బీమా రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పంటల బీమాపై తప్పుడు ప్రచారం చేసి రైతుల్లో అపోహలు సృష్టించవద్దని ఆయన సూచించారు.
రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన విస్తృత బీమా నమోదు కార్యక్రమాన్ని కూడా కొందరు వక్రీకరిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా నమోదు పూర్తిగా రైతుల సమ్మతితోనే జరిగిందని, ఎవరినీ బలవంతంగా నమోదు చేయలేదని స్పష్టం చేశారు.
ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనిశ్చితంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ముందుగానే గుర్తించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతు సేవా కేంద్రాలు, క్లస్టర్లు, రైతుల వారీగా అర్హత వివరాలను మ్యాపింగ్ చేసినట్లు చెప్పారు.
బీమా పరిధిలోకి రాని అర్హులైన రైతులను గుర్తించి జూలై 29 నుంచి 31 వరకు ప్రత్యేక పంటల బీమా నమోదు కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. ఇది సిబ్బందిపై ఒత్తిడి కాదని, రైతులకు రక్షణ కల్పించేందుకు తీసుకున్న బాధ్యతాయుతమైన చర్య అని వివరించారు.
బీమా గడువు ముగిసిన తర్వాత నమోదు చేసుకునే అవకాశం ఉండదని, అందుకే పంటలు సాగు చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులకు ముందుగానే అవగాహన కల్పించి బీమా పొందే అవకాశం కల్పించామని చెప్పారు.
పంటల బీమాలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం 0 నుంచి 2 శాతం మాత్రమేనని మంత్రి తెలిపారు. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు.
కొన్ని పంటలు, జిల్లాల్లో రైతులు చెల్లించాల్సిన ఎకరా ప్రీమియం వివరాలను కూడా మంత్రి వెల్లడించారు.
వరి – కోనసీమ జిల్లాలో రూ.76
సజ్జ – కర్నూలు జిల్లాలో రూ.32
మినుము – కడప జిల్లాలో రూ.38
వేరుశనగ – నెల్లూరు జిల్లాలో రూ.280
జొన్న – కడప, కర్నూలు జిల్లాల్లో రూ.35
మొక్కజొన్న – కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.66
కంది – కడప జిల్లాలో రూ.36
ఉల్లి – కడప, కర్నూలు జిల్లాల్లో రూ.90
మిరప – కర్నూలు, పల్నాడు జిల్లాల్లో రూ.360
క్లస్టర్, జిల్లా, పంట, బీమా సంస్థను బట్టి ప్రీమియంలో స్వల్ప మార్పులు ఉండవచ్చని ఆయన తెలిపారు.
ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో బీమా నమోదు గడువును పొడిగించేందుకు బీమా సంస్థలు తొలుత సుముఖంగా లేవని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలతో చర్చించి రైతుల ప్రయోజనాల కోసం గడువులు పొడిగించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
వాతావరణ ఆధారిత RWBCIS గడువును జూలై 15 నుంచి జూలై 31 వరకు పొడిగించారు. దిగుబడి ఆధారిత PMFBY గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పెంచారు.
అదే సమయంలో PMFBY నమోదును ఆగస్టు 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. నమోదు వివరాలను పూర్తి చేసేందుకు బ్యాంకులకు అదనంగా 15 రోజుల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఖరీఫ్–2026లో పంటల బీమా నమోదు గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ఖరీఫ్–2025లో 19.50 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు.. ఖరీఫ్–2026లో 35.17 లక్షలకు చేరాయి. అంటే దాదాపు 80 శాతం పెరుగుదల నమోదైంది.
ముఖ్యంగా రుణాలు తీసుకోని రైతుల బీమా నమోదులో భారీ వృద్ధి కనిపించిందని చెప్పారు. గత ఏడాది 2 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 20.35 లక్షలకు పెరిగిందన్నారు.
బీమా పరిధిలోని విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్‌లో 7.83 లక్షల హెక్టార్ల నుంచి 15.17 లక్షల హెక్టార్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అంటే దాదాపు 94 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా రూ.13,983 కోట్ల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
రైతులకు బీమా పరిహారం అందడం లేదంటూ విమర్శలు చేస్తున్న వారు గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా మిగిలిపోయిన సుమారు రూ.1,990 కోట్ల ప్రీమియం బకాయిలపై ముందుగా సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ బకాయిల కారణంగా రైతులకు రావాల్సిన బీమా పరిహారం నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను కూడా దశలవారీగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే ఖరీఫ్–2025కు సంబంధించిన ప్రభుత్వ ప్రీమియం చెల్లించడంతో రైతుల ఖాతాల్లో బీమా పరిహారం జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అచ్చెన్నాయుడు అన్నారు. అత్యంత తక్కువ ప్రీమియంతో రైతులకు గరిష్ఠ స్థాయిలో బీమా రక్షణ అందించాలన్నదే కూటమి ప్రభుత్వ విధానమని తెలిపారు.
రైతులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి వాటిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మంత్రి అన్నారు. పంటల బీమాపై వాస్తవాలను తెలుసుకుని రైతులకు సరైన సమాచారం అందించాలని సూచించారు. ఖరీఫ్–2026లో పెరిగిన బీమా నమోదు, విస్తీర్ణం, బీమా మొత్తం వంటి గణాంకాలే రైతు సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Tags
Be the first to react