తెలంగాణలోని ప్రముఖ బొగత జలపాతాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున, ములుగు జిల్లాలోని వాజేడు వద్ద ఉన్న బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు జలపాతం మూసి ఉంటుందని ములుగు జిల్లా అటవీ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అలాగే, ముత్యందార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణాపురం జలపాతాలను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులను ఆయా జలపాతాల వద్దకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ సూచనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.