ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా రావడంతో, ముందుగా ప్రకటించిన జమ తేదీ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ నిధులు (రూ.2,000) విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే రోజు ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.5,000 చొప్పున కలిపి మొత్తం రూ.7,000 జమ చేయనుంది.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో 47.41 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేయగా, ఇంకా 76,705 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు క్రియాశీలకంగా లేనట్లు తేలింది. మరోవైపు 44,977 మంది వివరాలు ఎన్పీసీఐలో కనిపించలేదని వెల్లడించింది. వీరంతా తమ ఖాతాలను యాక్టివ్ చేసి, ఆధార్‌ను లింక్ చేసి, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తిచేయాలని సూచించింది.
ఈ వివరాలన్నీ రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే, ఆర్టీజీఎస్, ఆర్ధిక సేవల కేంద్రం సంయుక్తంగా తుది జాబితా రూపొందించనుంది.