సాధారణంగా విమాన ప్రయాణాల్లో బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ అంటేనే విలాసానికి మారుపేరు. అక్కడ లభించే సౌకర్యాలు, ఇచ్చే బహుమతులు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రయాణికుల అవసరాలను గుర్తించిన కొన్ని ప్రముఖ విమానయాన సంస్థలు, ఇప్పుడు ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు కూడా అమెనిటీ కిట్స్ అందిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులకు ఇచ్చే ఈ చిన్న కిట్లలో ఏముంటాయి? ఏయే సంస్థలు వీటిని అందజేస్తున్నాయో ఒకసారి చూద్దాం.
అమెనిటీ కిట్ అంటే ఏమిటి?
అమెనిటీ కిట్ అనేది విమాన ప్రయాణ సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం అందించే ఒక చిన్న పౌచ్. ఇందులో సాధారణంగా కంటికి పెట్టుకునే మాస్క్ (Eye mask), చెవుల్లో పెట్టుకునే ఇయర్ ప్లగ్స్ (Earplugs), సాక్స్, బ్రష్, పేస్ట్ వంటి ప్రాథమిక వస్తువులు ఉంటాయి. 1930వ దశకంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం, నేడు విమానయాన సంస్థల బ్రాండ్ వాల్యూను పెంచే సాధనంగా మారింది.
ఎకానమీ క్లాస్‌లో కిట్స్ ఇచ్చే సంస్థలు ఇవే!
ఎమిరేట్స్ (Emirates)
దుబాయ్‌కి చెందిన ఈ దిగ్గజ సంస్థ సుదీర్ఘ ప్రయాణం చేసే ఎకానమీ ప్రయాణికులకు ప్రత్యేకమైన కిట్లను అందిస్తోంది. వన్యప్రాణుల థీమ్‌తో రూపొందించిన ఈ పౌచ్‌లలో పర్యావరణానికి హాని చేయని రీసైకిల్ వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో బుక్‌మార్క్ లాగా కూడా వాడుకోగలిగే సువాసన కార్డులు ఉండటం విశేషం.
ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways)
ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ప్రయాణించే వారికి ఎతిహాద్ ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. బిజినెస్ క్లాస్‌లో ప్రఖ్యాత జార్జియో అర్మానీ బ్రాండ్‌తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఎకానమీలో మాత్రం పర్యావరణ హితమైన సరళమైన పౌచ్‌లను ఇస్తారు.
టర్కిష్ ఎయిర్‌లైన్స్ (Turkish Airlines)
బ్రాండెడ్ కిట్లను ఎకానమీలో ఇచ్చే ఏకైక సంస్థగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ గుర్తింపు పొందింది. ప్రసిద్ధ 'లాకోస్ట్' (Lacoste) బ్రాండ్ పౌచ్‌లను వీరు ప్రయాణికులకు అందజేస్తారు. ఇందులో చెప్పులు (Slippers) కూడా ఉండటం గమనార్హం.
సింగపూర్ ఎయిర్‌లైన్స్
వీరు అందరికీ కిట్లను పంపిణీ చేయరు కానీ, ఎవరైనా ప్రయాణికుడు అడిగితే అందుబాటును బట్టి అందజేస్తారు. అయితే టూత్ పేస్ట్, బ్రష్ వంటి వస్తువులు వీరు వాష్‌రూమ్స్‌లోనే అందుబాటులో ఉంచుతారు.
ప్రీమియం ఎకానమీలో ఇంకాస్త మెరుగ్గా..
ప్రీమియం ఎకానమీ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా TUMI బ్రాండ్ కిట్లను, క్వాంటాస్ ఎయిర్‌వేస్ 'నెపోలియన్ పెర్డిస్' బ్రాండ్ పౌచ్‌లను అందజేస్తున్నాయి. ఇవి సాధారణ ఎకానమీ కంటే నాణ్యంగా, విలాసవంతంగా ఉంటాయి.
కొత్త విమాన సర్వీసులు ప్రారంభమైనప్పుడు కూడా కొన్ని సంస్థలు ప్రత్యేక కానుకలను అందజేస్తుంటాయి. కేవలం గమ్యాన్ని చేరడమే కాకుండా, ఆ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగాలని కోరుకునే ప్రయాణికులకు ఈ చిన్న కిట్లు పెద్ద ఊరటనిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని విమానయాన సంస్థలు సాధారణ ప్రయాణికులకు కూడా ఇలాంటి కిట్లను అందించే అవకాశం కనిపిస్తోంది.