మంచు తుపానులో కూలిన ప్రైవేట్ జెట్..
టేకాఫ్ అయిన 45 సెకన్లకే కూలిన విమానం..
మంచు తుపాను సృష్టించిన బీభత్సం..
అమెరికాలోని మైనే రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి బాంగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక ప్రైవేట్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ భారీగా మంచు తుపాను కురుస్తుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
బంబార్డియర్ ఛాలెంజర్ 600 అనే ప్రైవేట్ జెట్ విమానం ఎయిర్‌పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కేవలం 45 సెకన్లలోనే నియంత్రణ కోల్పోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్‌ల ప్రకారం, విమానం ఒక్కసారిగా తలకిందులుగా మారి నేలకూలింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 8 మంది ఉన్నారు. విమానం కూలిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అదృష్టవశాత్తూ ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
ప్రతికూల వాతావరణం:
ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో వాతావరణం చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన మంచు తుపాను కారణంగా దృశ్యమానత (Visibility) తగ్గిపోయినప్పటికీ విమానాల రాకపోకలు సాగించడంపై విమర్శలు వస్తున్నాయి. విమానాశ్రయ డైరెక్టర్ ప్రకారం, సహాయక బృందాలు ప్రమాద సమాచారం అందిన నిమిషంలోపే అక్కడికి చేరుకున్నాయి.
దర్యాప్తు మరియు చర్యలు:
ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణ ప్రారంభించాయి. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక వాతావరణ ప్రభావమా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనతో బాంగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.