Tourism: నో సిగ్నల్.. నో రోడ్స్! కొండ అంచున ‘తేనెతుట్టె’ లాంటి ఆశ్రమం.. ఇండియాలోనే అత్యంత అరుదైన ప్రదేశం! పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా?
లడఖ్ అనగానే బైక్ రైడర్లు, పర్వత శ్రేణులు, అద్భుతమైన రహదారులు గుర్తుకువస్తాయి. కానీ, అదే లడఖ్‌లోని కఠినమైన కొండల మధ్య, ఒక నదీ లోయపై ఉన్న నిలువుటాకారపు కొండ అంచున భారతదేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమం ఒకటి ఉంది.
- టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో 15వ శతాబ్దం ప్రారంభంలో ఆశ్రమ స్థాపన..
- Travel: సముద్ర మట్టానికి 3,580 మీటర్ల ఎత్తులో కొండగుహలో ఫుగ్తాల్ ఆశ్రమం..
Tourism: మన దేశంలో టూరిజం అనగానే చాలామందికి లడఖ్ (Ladakh) టక్కున గుర్తొస్తుంది. బైక్ రైడర్లు, ఎత్తైన కొండలు, మంచు రహదారులు.. ఇవే కదా మనకు గుర్తొచ్చేవి? కానీ, ఇదే లడఖ్లోని ఒక మారుమూల కొండల మధ్య, నదీ లోయపై ఉన్న కొండ అంచున భారతదేశంలోనే అత్యంత అరుదైన, విచిత్రమైన ఆశ్రమం ఒకటి ఉంది. అదే 'ఫుగ్తాల్ మొనాస్టరీ' (Phugtal Monastery).
సాధారణ పర్యాటక ప్రాంతాల లాగా మనం కార్లలోనో, బైక్లపైనో నేరుగా ఈ ఆశ్రమం గేటు ముందుకు వెళ్లలేము. ఎందుకంటే ఇక్కడికి వెళ్లేందుకు అసలు రోడ్లే లేవు! అక్కడ షాపింగ్ మాల్స్, హోటళ్లు మాత్రమే కాదు.. కనీసం మీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా, ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఈ అద్భుతమైన ప్రదేశం గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం...
తేనెతుట్టె లాంటి ఆశ్రమం.. పేరు వెనుక కథేంటి?
లడఖ్లోని జన్స్కార్ ప్రాంతంలో ఉన్న లుంగ్నాక్ లోయలో ఈ ఫుగ్తాల్ మొనాస్టరీ ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 3,850 మీటర్ల ఎత్తులో, ప్రవహించే 'త్సారాప్' నదికి పైభాగంలో ఒక సహజమైన గుహలో దీనిని కట్టారు. దీని పేరు వెనుక ఒక మంచి అర్థం ఉంది. స్థానిక భాషలో 'ఫుగ్' అంటే గుహ అని, 'తాల్' అంటే విముక్తి అని అర్థం. అంటే ఇది 'విముక్తిని ప్రసాదించే గుహ' అన్నమాట. ఈ ఆశ్రమాన్ని దూరం నుంచి చూస్తే.. ఒక నిలువు కొండకు ఒక పెద్ద తేనెతుట్టె (Honeycomb) అంటుకుని ఉన్నట్లు భలే విచిత్రంగా కనిపిస్తుంది.
అంత పెద్ద ఆశ్రమానికి రోడ్డు ఎందుకు లేదు?
ఈ ఆశ్రమానికి రోడ్డు మార్గం లేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ మొనాస్టరీ ఒక ఇరుకైన లోయలో, చాలా సున్నితమైన కొండ అంచున ఉంది. ఇక్కడికి వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మించాలంటే కొండలను డైనమైట్లతో పేల్చాల్సి ఉంటుంది.
అలా పేలుళ్లు జరిపితే, శతాబ్దాల నాటి ఈ పురాతన గుహ దెబ్బతినడమే కాకుండా.. మట్టి, కలపతో కట్టిన ఆశ్రమ భవనాలు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ చారిత్రక సంపదను కాపాడటం కోసం అక్కడికి రోడ్డు వేయలేదు. కేవలం కాలినడకన మాత్రమే ఇక్కడికి చేరుకోవాలి.
పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారు?
ఈ అడ్వెంచర్ ప్లేస్ను చూడాలనుకునే వారు మొదట లేహ్ లేదా కార్గిల్ నుంచి జన్స్కార్లోని 'పదుమ్' పట్టణానికి చేరుకోవాలి. అక్కడి నుంచి వాహనాల్లో 'పుర్నే' లేదా 'చాహ్' అనే గ్రామాలకు వెళ్లవచ్చు.
చాలా మంది పర్యాటకులు పుర్నే గ్రామం నుంచే తమ నడకను (ట్రెకింగ్ను) మొదలుపెడతారు. పుర్నే నుంచి ఆశ్రమానికి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. త్సారప్ నది ఒడ్డున, కొండల మధ్య నుంచి నడుస్తూ వెళ్లడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. దారిలో ఒక ఊగే సస్పెన్షన్ వంతెనను (తాడు వంతెన) దాటి, చివరి కొండ ఎక్కితే ఈ అద్భుత ఆశ్రమం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.
వెయ్యి ఏళ్లకు పైగా ఆధ్యాత్మిక చరిత్ర..
ఈ సహజ గుహ దాదాపు 2,000 సంవత్సరాలుగా ధ్యానం చేసుకునే సాధువులకు, గురువులకు నిలయంగా ఉంది. హిమాలయాలకు బౌద్ధమతాన్ని పరిచయం చేసిన గొప్ప గురువు 'పద్మసంభవ' కూడా ఈ గుహలోనే ధ్యానం చేశారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఇక ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కట్టడాన్ని 15వ శతాబ్దం ప్రారంభంలో టిబెటన్ బౌద్ధ గురువు 'జంగ్సెం షేరప్ జంగ్పో' స్థాపించారు. నేటికీ డజన్ల కొద్దీ బౌద్ధ సన్యాసులు (Monks) బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇక్కడే నివసిస్తూ ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు.
ఫోన్ రింగ్ల గోల, సోషల్ మీడియా నోటిఫికేషన్ల టెన్షన్లు ఏవీ లేకుండా.. ప్రకృతి ఒడిలో నిజమైన ప్రశాంతతను అనుభవించాలనుకునే వారికి, కాస్త సాహసం చేయాలనుకునే వారికి 'ఫుగ్తాల్ మొనాస్టరీ' ఒక అద్భుతమైన ప్రపంచం. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన హిమాలయ రహస్యం ఇది!
Tags
Be the first to react