ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించడంపై దృష్టి పెట్టింది. ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా పోలీస్ శాఖకు సంబంధించిన సేవలను కూడా వాట్సాప్‌లో అందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, సంక్రాంతి నాటికి దాదాపు అన్ని కీలక సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ వివరాలు, ఎఫ్‌ఐఆర్ స్థితి, ట్రాఫిక్ ఈ-చలాన్లు వంటి సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రజలు పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే, ఇంటి నుంచే ఈ వివరాలను పొందవచ్చు. దీంతో సమయం ఆదా అవడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు తగ్గనున్నాయి.
ఈ సేవలను వినియోగించుకోవాలంటే ముందుగా 95523 00009 నంబరును మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్‌లో ‘బీఖి’ అని మెసేజ్ పంపితే ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ఆప్షన్ వస్తుంది. తెలుగు భాషలో సేవలు కావాలంటే ‘టీఈ’ అని టైప్ చేయాలి. అనంతరం పోలీస్ శాఖ సేవలను ఎంచుకుంటే, ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్టేటస్, ఈ-చలాన్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
ఈ-చలాన్ ఆప్షన్‌ను ఎంచుకుని వాహనం నంబర్ నమోదు చేస్తే, ఆ వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వివరాలు వెంటనే కనిపిస్తాయి. వాటిని ఆన్‌లైన్‌లోనే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాల ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తైన వెంటనే రసీదు కూడా వాట్సాప్‌లోనే అందుతుంది. ఒకవేళ చలాన్లు లేకపోతే ‘నో చలానాస్ ఫౌండ్’ అనే మెసేజ్ వస్తుంది.
రవాణాశాఖ, పోలీస్ శాఖ విధించిన చలాన్లు అన్నీ ఒకే చోట చూడగలిగే విధంగా ఈ వ్యవస్థ రూపొందించారు. దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు, వాహనదారులు తమ బాధ్యతలను సులభంగా నిర్వర్తించవచ్చు. మొత్తంగా ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా పోలీస్ సేవలను డిజిటల్‌గా అందించడం ప్రజలకు పెద్ద ఊరటగా మారిందని అధికారులు చెబుతున్నారు.