ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభం చేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా, నామమాత్రపు రుసుముతో భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గదర్శకాలను అనుసరించి రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
తండ్రి, తాతల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను విభజన చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. భూములపై హక్కులు కలిగిన వారిని స్పష్టంగా గుర్తించడమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు.
వారసులను నిర్ధారించేందుకు కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే తండ్రి, తాతలు లేదా పూర్వ యజమానులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వాలి. రీసర్వే లేదా భూ హక్కుల పుస్తకాలు ఉన్న ప్రాంతాల్లో ఎల్‌పీఎం నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
స్టాంప్ డ్యూటీ విషయానికి వస్తే ప్రభుత్వం రైతులకు ఊరట కల్పించింది. భూమి మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100, రూ.10 లక్షలకు మించి ఉంటే రూ.1000 మాత్రమే స్టాంప్ డ్యూటీగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులు ముందుగానే అన్ని పత్రాలను సరిచూసుకుని రావాలని అధికారులు సూచించారు. సందేహాలుంటే సమీప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
నిషేధిత భూములు మరియు చుక్కల భూముల సమస్యలపై కూడా అధికారులు దృష్టి సారించారు. అనంతపురం జిల్లాలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన పెండింగ్ దస్త్రాలను ఇప్పటికే మూడు విడతల్లో వెయ్యికి పైగా పరిష్కరించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5822 చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. అలాగే వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను సరిచేసే పనులను కూడా వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.