టీమ్‌ఇండియా విమెన్ క్రికెట్ లో కలకలం! కెప్టెన్సీ మార్పు!

Harman Vs Smriti : భారత మహిళల క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మార్పు వెనుక అసలు కారణమేంటి? హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య కొంతకాలంగా కెప్టెన్సీ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.

SMriti Replaces Harmanpreet as Indian Captain
SMriti Replaces Harmanpreet as Indian Captain
  • హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు.
  • కెప్టెన్సీ విషయంలో హర్మన్‌, స్మృతి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న ప్రచారం తెరపైకి వచ్చింది.

Harman Vs Smriti : భారత మహిళల క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మార్పు వెనుక అసలు కారణమేంటి? హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య కొంతకాలంగా కెప్టెన్సీ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.

ఓ జట్టు వర్గాన్ని ఉటంకిస్తూ వచ్చిన నివేదిక ప్రకారం.. కెప్టెన్సీ అంశం కొంతకాలంగా హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ కనిపించిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇద్దరు క్రికెటర్ల నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఐసీసీ టైటిల్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినప్పటికీ.. ఆ తర్వాత కెప్టెన్సీలో మార్పు జరగకపోవడంపై స్మృతి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్మృతి సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించడం హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంపై ప్రశ్నలను పెంచింది. అయినప్పటికీ సెలెక్టర్లు ఆమెను కెప్టెన్‌గా కొనసాగించారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా నేతృత్వంలో గువాహటిలో జరిగిన సమీక్ష సమావేశం తర్వాత పరిస్థితులు మారినట్లు సమాచారం. కెప్టెన్సీలో మార్పు తప్పదనే సంకేతాలు హర్మన్‌ప్రీత్‌కు అందినట్లు ఓ నివేదిక పేర్కొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

అయితే హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? కెప్టెన్సీ మార్పుకు అదే ప్రధాన కారణమా? అనే విషయంపై బీసీసీఐ లేదా ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మిథాలీ రాజ్‌ సమయంలోనూ ఇదే చర్చ

భారత మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పుల సమయంలో విభేదాల చర్చ రావడం ఇదే తొలిసారి కాదని క్రికెట్‌ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిథాలీ రాజ్‌ నుంచి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనూ ఇద్దరు సీనియర్‌ క్రికెటర్ల మధ్య సంబంధాలపై అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. జట్టులో వర్గపోరు ఏర్పడిందనే ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు హర్మన్‌ప్రీత్‌ మరో మూడేళ్లపాటు ఆటగాడిగా కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్త కెప్టెన్‌ స్మృతి మంధానతో ఆమె ఎలా సమన్వయం చేసుకుంటుంది? ఇద్దరూ కలిసి జట్టును విజయాల దిశగా ఎలా నడిపిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి.. భారత మహిళల క్రికెట్‌లో నాయకత్వ మార్పు కొత్త దశకు నాంది పలికింది. అయితే హర్మన్‌ప్రీత్‌–స్మృతి మధ్య విభేదాలే ఈ నిర్ణయానికి కారణమన్న ప్రచారంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Be the first to react

Latest