మార్కెట్ పనీర్ వద్దు.. ఇంట్లోనే దూదిలాంటి మెత్తటి పనీర్!
Home made Paneer: లీటర్ పాలతో ఇంట్లోనే మెత్తటి, స్పాంజీ పనీర్ తయారు చేసుకోవడం ఎలా? చెఫ్ నిషా మధులిక సూచించిన సులభమైన చిట్కాలు, తయారీ విధానం తెలుసుకోండి.
Food: పనీర్‌తో కూరలు, స్నాక్స్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా శాకాహారులకు ప్రోటీన్ అందించే మంచి ఆహార పదార్థాల్లో పనీర్ ఒకటి. అయితే మార్కెట్లో దొరికే పనీర్ నాణ్యతపై కొందరికి సందేహాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే స్వచ్ఛమైన, మెత్తటి పనీర్ తయారు చేసుకోవచ్చు. ప్రముఖ చెఫ్ నిషా మధులిక సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే కేవలం గంట నుంచి రెండు గంటల్లోనే స్పాంజీ పనీర్ సిద్ధమవుతుంది.
కావాల్సిన పదార్థాలు
ఫుల్ క్రీమ్ పాలు – 1 లీటర్
నిమ్మరసం – 3 టీస్పూన్లు
నీళ్లు – 6 టీస్పూన్లు
శుభ్రమైన కాటన్ లేదా మస్లిన్ వస్త్రం
ఒక లీటర్ ఫుల్ క్రీమ్ పాలతో సుమారు 200 గ్రాముల పనీర్ తయారవుతుంది. రెండు లీటర్ల పాలు ఉపయోగిస్తే దాదాపు 400 గ్రాముల పనీర్ వస్తుంది.
పాలు విరగ్గొట్టేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి
ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. ఆ తర్వాత సన్నని మంటపై కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టాలి. చాలామంది మరుగుతున్న పాలలో నేరుగా నిమ్మరసం లేదా వెనిగర్ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పనీర్ గట్టిగా మారే అవకాశం ఉంటుంది.
మెత్తటి పనీర్ రావాలంటే మూడు టీస్పూన్ల నిమ్మరసంలో ఆరు టీస్పూన్ల నీళ్లు కలిపి పల్చగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కొద్దికొద్దిగా పోస్తూ చెంచాతో నెమ్మదిగా కలపాలి. దీంతో పాలు విరిగి పనీర్, నీరు వేరవుతాయి.
పనీర్‌ను ఇలా వడకట్టాలి
ఇప్పుడు ఒక గిన్నెపై జల్లెడ పెట్టి దానిపై శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని వేయాలి. విరిగిన పాలను అందులో పోసి నీటిని వడకట్టాలి. వస్త్రంలో మిగిలిన పనీర్‌పై కొద్దిగా చల్లటి నీళ్లు పోసి రెండుసార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసం వల్ల వచ్చిన పులుపు తగ్గుతుంది. అనంతరం వస్త్రాన్ని గట్టిగా పిండి మూటలా కట్టి సుమారు 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
స్పాంజీ పనీర్ కోసం ఈ చివరి చిట్కా
పనీర్ మూటను ఒక వెడల్పాటి ప్లేట్ లేదా పాన్‌పై ఉంచాలి. దానిపై మరీ ఎక్కువ బరువు కాకుండా ఒక చపాతీ కర్ర లేదా చిన్న బరువును పెట్టాలి. ఇలా 30 నుంచి 35 నిమిషాలు ఉంచితే పనీర్‌లోని అదనపు నీరు బయటకు వచ్చి మంచి ఆకారం వస్తుంది. ఆ తర్వాత వస్త్రం నుంచి తీసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతే.. ఇంట్లోనే మెత్తటి, స్పాంజీ పనీర్ సిద్ధం!
దీనిని వెంటనే వంటల్లో ఉపయోగించుకోవచ్చు. మిగిలిన పనీర్‌ను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
Tags
Be the first to react