Vangalapudi Anitha: జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీకి రావాలి.. రోడ్డు మీద నిలబడి ఆరోపణలు చేయడం కాదంటూ జగన్ కు కౌంటర్!
వైసీపీ అధినేత జగన్ కు ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, రోడ్ల మీద నిలబడి చేసే ఆరోపణలకు సభలో ఆధారాలు చూపాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. శాసనసభకు రాకుండా బయట విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు.
- Politics: సభకు వచ్చి ఆధారాలు చూపాలని సవాల్...
- మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిన అనిత..
వైసీపీ అధినేత జగన్ కు ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, రోడ్ల మీద నిలబడి చేసే ఆరోపణలకు సభలో ఆధారాలు చూపాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. శాసనసభకు రాకుండా బయట విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు. బుధవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“ఎమ్మెల్యేగా గెలిచిన వారికి తమ నియోజకవర్గ సమస్యలను శాసనసభలో ప్రస్తావించడం ప్రాథమిక బాధ్యత. కానీ జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోవడం విచారకరం. గతంలో శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానం చేసిన జగన్, ఇప్పుడు అదే మండలికి తమ ప్రతినిధులను పంపుతున్నారు. కానీ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలను మాత్రం అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు” అని అనిత ఆరోపించారు. ప్రభుత్వంపై చేసే ఆరోపణలకు అసెంబ్లీ కంటే మెరుగైన వేదిక మరొకటి లేదని, తాము ప్రతి అంశంపై చర్చించి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఐదేళ్లలో చేయలేని వారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను హోంమంత్రి తీవ్రంగా ఖండించారు. “ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీని కూడా పూర్తి చేయలేని వైసీపీ నేతలు, ఇప్పుడు మేము పారదర్శకంగా నిర్వహిస్తుంటే నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. డీఎస్సీపై ఆధారాలుంటే అసెంబ్లీకి వచ్చి చూపించండి. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే” అని అన్నారు.
కష్టపడి చదివి, కుటుంబాలకు దూరంగా ఉండి, కోచింగ్‌లకు వేల రూపాయలు ఖర్చు చేసి ఉద్యోగాలు సాధించిన యువత ప్రతిభను, వారి కుటుంబాల ఆనందాన్ని అవమానించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. “మొత్తం డీఎస్సీ నియామకాలే అక్రమమని మాట్లాడితే, ఉద్యోగం సాధించిన వారి కష్టాన్ని, ప్రతిభను కించపరిచినట్లే. రాజకీయాల కోసం యువత భవిష్యత్తుతో, వారి మనోభావాలతో ఆడుకోవద్దు” అని హితవు పలికారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..
అంతకుముందు, హోంమంత్రి అనిత పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను ఓపికగా విని, మొత్తం 65 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ‘మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్’ బాధితులు తమ గోడును వెళ్లబోసుకోగా, ప్రభుత్వం ఇప్పటికే డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, ఆర్థిక మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
అలాగే, నాయుడుపేట నుంచి వచ్చిన ఓ తండ్రి తన కుమార్తె చదువు, తన ఉపాధి గురించి మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆమె వెంటనే స్పందించారు. చిన్నారిని హాస్టల్‌లో చేర్పించి చదువు కొనసాగించేలా చూడాలని, తండ్రికి ఉపాధి కల్పించే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించడమే తమ ప్రభుత్వ బాధ్యత అని అనిత పేర్కొన్నారు.
Tags
Be the first to react