ఉక్రెయిన్ యుద్ధం నుండి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అమెరికాకు చేరుకున్న వేలాది మంది ఇప్పుడు తీవ్రమైన అనిశ్చితి పరిస్థితిలో జీవిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించిన ‘యూఎస్ హ్యూమానిటేరియన్ ప్యారోల్ ప్రోగ్రామ్’ కింద రెండు లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు నివాసం, ఉపాధి పొందినప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత్వంలో వచ్చిన మార్పులు వారి జీవితాలను గందరగోళంలోకి నెట్టేశాయి. వీసా గడువు ముగిసినా, పునరుద్ధరణ కోసం దరఖాస్తులు ఆమోదం పొందకపోవడంతో వేలాది కుటుంబాలు పని లేక, ఆధారం లేక, ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో అన్న భయంలో ఉన్నారు.
ఫోర్ట్ లాడర్డేల్‌లో పనిచేసిన కటరీనా గోలిజ్ద్రా పరిస్థితి ఈ సంక్షోభానికి చిహ్నంగా మారింది. మంచి ఉద్యోగం, ఆరోగ్య బీమా, స్థిరమైన జీవితం—అన్నీ ఒక్కరోజులో కోల్పోయింది. వర్క్ పెర్మిట్ గడువు ముగియగానే ఉద్యోగం పోయింది. ఆరోగ్య బీమా లేకపోవడం ఆమెకు మరింత బాధ. అంతేకాదు, జర్మనీలో నివసిస్తున్న తన తల్లికి ఆర్థిక సహాయం పంపించే మార్గం కూడా మూసుకుపోయింది అది చెప్పుకొచ్చారు.
ఇలాంటి పరిస్థితి కేవలం ఆమెకే కాదు. రాయిటర్స్ మాట్లాడిన డజన్లాది ఉక్రెయిన్ శరణార్థులు ఇదే కథ చెబుతున్నారు. ఐటీ రంగం నుంచి ఇంటీరియర్ డిజైన్ వరకు, టీచర్ల నుంచి ఫైనాన్స్ నిపుణుల వరకు అందరూ గడువు ముగిసిన ప్యారోల్ స్టేటస్ పునరుద్ధరణ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ జీవనోపాధిని కోల్పోయారు. కొంతమంది ఇంట్లో నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. మరికొందరు కెనడా, దక్షిణ అమెరికా దేశాలకు వెళ్లిపోయారు.
ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లే అవకాశం మాత్రం అందరికీ అసంభవం. బుచా వంటి ప్రాంతాల్లో జరిగిన దారుణాలు, రష్యా దాడులు పునరావృతమైతే తమ జీవితం ప్రమాదంలో పడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. “చట్టపరమైన స్థితి లేకపోవడంతో బయటకు వెళ్లడానికే భయపడుతున్నాం” అని పలువురు చెప్పారు.
ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాసెసింగ్ నిలిపివేయడం, ఫీజులు భారీగా పెంచడం, ప్రతీసారి కొత్త షరతులు విధించడం ఇవన్నీ శరణార్థులను మరింత అనిశ్చితిలోకి నెట్టేశాయని నిపుణులు పేర్కొన్నారు. దరఖాస్తులు నెమ్మదిగా ప్రాసెస్ అవుతుండగా, డిపోర్టేషన్ భయం ఎక్కువవుతోంది.
ఈ నేపథ్యంలో కొంతమంది ‘సెల్ఫ్ డిపోర్ట్’ అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అనేక నియమాలు, అనిశ్చితి, డిపోర్ట్ అయ్యే ప్రమాదం కారణంగా స్వచ్ఛందంగా అమెరికా వీడి ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు, శరణార్థుల హక్కుల సంఘాలు అందరూ ఒకే మాట చెబుతున్నారు: “యుద్ధం నుండి పారిపోయిన నిరపరాధ ప్రజలను ఇలా మధ్యలో వదిలేయడం హ్యూమానిటేరియన్ విలువలకు విరుద్ధం.”
ఇప్పుడు ఈ కుటుంబాల భవిష్యత్ ఏం అవుతుందన్న ప్రశ్న ఇంకా అనుత్తరంగానే ఉంది. ట్రంప్ ప్రభుత్వపు నిర్ణయాలు మారతాయా? పునరుద్ధరణ దరఖాస్తులు వేగవంతం అవుతాయా? లేక వేలాది కుటుంబాల జీవితం ఇలా అనిశ్చితి చీకటిలోనే నడుస్తుందా? అన్న సమాధానం కోసం ఉక్రెయిన్ శరణార్థులు అమెరికాలోనే, తమ చిన్న చిన్న అద్దె గదుల్లో కమ్ముతున్న భయాందోళనల మధ్య ఎదురు చూస్తున్నారు.