పుట్టపర్తిలో మంత్రి నారా లోకేష్ 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామాలు, పట్టణాల నుంచి చాలామంది ప్రజలు, టీడీపీ కార్యకర్తలు వచ్చి తమ సమస్యలు ఆయనకు చెప్పారు. ప్రతి ఒక్కరినీ లోకేష్ స్వయంగా పలకరించి, శ్రద్ధగా వినతులు తీసుకున్నారు.
ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన డి. లోకేష్ తనపై గత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. ఆ కేసులను రద్దు చేయాలని, తనకు న్యాయం చేయాలని ఆయన మంత్రిని కోరారు.
బుక్కపట్నం ప్రాంతానికి చెందిన గాజుల రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నానని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. కొంత సాయం చేయాలని, అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చెన్నేకొత్తపల్లి గ్రామానికి చెందిన టి. నాగభూషణం మాట్లాడుతూ, తాను కొనుగోలు చేసిన రెండున్నర సెంట్ల స్థలాన్ని గత ప్రభుత్వ అండతో హనుమంతరెడ్డి ఆక్రమించేశాడని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసి, తనకు తగిన న్యాయం చేయాలని కోరారు.
పుట్టపర్తికి చెందిన ఎన్. జయలక్ష్మి, ఎంఏ, బీ.ఎడ్ చదివిన తాను ఎండోమెంట్స్ కార్యాలయంలో ఉద్యోగావకాశం ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. అందరి సమస్యలను విన్న మంత్రి నారా లోకేష్, వీలైనంత త్వరగా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.