తిరుపతి, బెంగళూరు దిశగా ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్తను అందించింది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు వస్తున్న భారీ స్పందనను దృష్టిలో పెట్టుకుని, విజయవాడ–బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్లేలా రూట్‌ను ఖరారు చేశారు. కొంతకాలంగా అనుమతులు, కోచ్‌ల సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ రైలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 10న అధికారికంగా రన్‌లోకి రానున్న ఈ వందే భారత్‌పై ఇప్పటికే ప్రయాణీకుల్లో ఆసక్తి పెద్దఎత్తున కనిపిస్తోంది.
ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బెంగళూరుకు కూడా హైస్పీడ్ రైలు కోసం వచ్చిన డిమాండ్ పెరగడంతో, విజయవాడ–బెంగళూరు మార్గంలో వందే భారత్ నడపడానికి రైల్వే అధికారులు మే నెలలోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలపారు. అయితే కోచ్‌లు కేటాయింపు, టెక్నికల్ ఏర్పాట్లు పూర్తికావడంలో ఆలస్యం కావడంతో రైలు ప్రారంభం వాయిదా పడింది. అన్ని ఏర్పాట్లు పూర్తికావడంతో ఇప్పుడు షెడ్యూల్, నెంబర్, స్టాపేజీలను ఖరారు చేసి, అధికారిక ప్రకటన దశకు వెళ్లింది.
ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి ఉదయం త్వరగానే బయలుదేరి, సాయంత్రానికి బెంగళూరుకు చేరుకునేలా టైమ్ టేబుల్ రూపొందించారు. 20711 నెంబర్‌తో వెళ్లే రైలు విజయవాడ జంక్షన్ నుంచి ఉదయం 5.15కు స్టార్ట్ అవుతుంది. తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43 వద్ద ఆగుతుంది. తర్వాత ఉదయం 9.45కి తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38 గం.లకు చేరుకుని, చివరగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు టెర్మినల్ స్టేషన్‌లో రైలు నిలుస్తుంది. ఇలా విజయవాడ నుంచి బెంగళూరువరకు ప్రయాణాన్ని సుమారు తొమ్మిది గంటలలో పూర్తి చేసుకునే వీలుంటుంది.
తిరుగు ప్రయాణంలో అదే రోజు 20712 నెంబర్‌తో బెంగళూరులోని ఎస్‌ఎంవీటీ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు రైలు బయలుదేరుతుంది. వెంటనే కృష్ణరాజపురం 2.58, కాట్పాడి 5.23, చిత్తూరు 5.49, తిరుపతి 6.55 వద్ద ఆగుతుంది. రాత్రి 8.18కు నెల్లూరు, 9.29కు ఒంగోలు, 10.42కు తెనాలిని దాటి, చివరగా రాత్రి 11.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దీనివల్ల తిరుపతి వెళ్లే భక్తులకు, బెంగళూరు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు సమయానుసారం వెళ్లి రావడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ఈ వందే భారత్‌లో మొత్తం 8 బోగీలు ఉండగా, అందులో 7 సాధారణ ఏసీ చెయిర్‌కార్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చెయిర్‌కార్ కోచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు నడుస్తుంది. మంగళవారం మాత్రం రేకుల పనులు, మెయింటెనెన్స్ కోసం సర్వీసులు నిలిపివేస్తారు. ఇతర రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం దాదాపు మూడు గంటల వరకు తగ్గడం, పూర్తిగా ఏసీ సౌకర్యం, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన సీట్లు ఉండడం వంటి అంశాల కారణంగా ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావాల్సిందేనని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తిరుమల యాత్రికులు తిరుపతికి త్వరగా చేరుకోవడానికి, ఐటీ, ఉద్యోగ అవసరాలతో బెంగళూరుకు వెళ్లే వారికీ ఈ వందే భారత్ పెద్ద సౌలభ్యంగా మారనుంది. సమయపాలన, వేగం, కంఫర్ట్‌ను కలిపిన ఈ సేవ ప్రారంభమైతే, తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా, వేగవంతంగా మారబోతోందని రైల్వే ప్రయాణీకులు భావిస్తున్నారు.