కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, సమాజసేవపై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను వివరించారు. దివంగత ఎన్టీఆర్ ఎప్పుడూ “మానవసేవయే మాధవసేవ” అని నమ్మారని, అదే ధ్యేయంతో ట్రస్ట్ ఇప్పటికీ ఆపన్నులకు అండగా నిలుస్తోందని ఆమె చెప్పారు. ఈ సందర్శన సందర్భంగా 48 కుట్టుమిషన్లు, 30 తోపుడు బండ్లను మహిళలకు, నిరుపేదలకు అందించి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు ట్రస్ట్ కట్టుబడి ఉందని తెలియజేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య రంగంలో చేస్తున్న సేవలను వివరించిన భువనేశ్వరి, ప్రస్తుతం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల రక్తదాన కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 9 లక్షల మందికి సురక్షిత రక్తం అందించామని చెప్పారు. ముఖ్యంగా థలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈ ట్రస్ట్ పెద్ద అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
అలాగే, ఎన్టీఆర్ సంజీవని క్లీనిక్ ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్యం అందించామని భువనేశ్వరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ క్లీనిక్స్ ద్వారా చేరువయ్యి మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. విద్యారంగంలో కూడా ట్రస్ట్ పెద్ద పాత్ర పోషిస్తున్నదని, 2,114 మంది చిన్నారులకు విద్య అందించడంతో పాటు విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3.5 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
కుప్పంలో నడుస్తున్న స్త్రీ శక్తి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 7,775 మహిళలకు టైలరింగ్, జూట్ బ్యాగ్ తయారీ, మగ్గం పని, చికెన్ కారీవర్క్, బ్యూటీషియన్ కోర్సులు వంటి పలు రంగాల్లో శిక్షణ అందించినట్లు ఆమె చెప్పారు. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ సుజల పథకంలో మూడు క్లస్టర్లు పనిచేస్తున్నాయని, న్యూట్రిఫుల్ యాప్‌ను ఆరోగ్య అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అనేక పథకాలు తీసుకొచ్చారని భువనేశ్వరి అన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగి సత్తాచాటాలని, ఇందుకోసం ట్రస్ట్ నిరంతరం శిక్షణలు, ఉపాధి సాధనాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సమాజంలో మహిళల బలపాటు, ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు కొనసాగుతాయని భువనేశ్వరి స్పష్టంచేశారు.