బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పొరుగు రాష్ట్రం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం మరింత బలపడటంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా 16 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ అల్పపీడనం కారణంగా దక్షిణ, డెల్టా ప్రాంతాలతో పాటు మధ్య, ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాథపురం, శివగంగ, విరుదునగర్, మధురై జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పెరంబలూరు, అరియలూర్, కడలూరు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. పుదుచ్చేరి, కారైకాల్‌లోనూ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరునెల్వేలి, తెన్‌కాశిలోని తామిరబరణి నది పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది.
ఆలయంలోకి చేరిన నీరు సముద్రంలోకి వెళ్లడంతో తీర ప్రాంతంలో నేల కోతకు గురైంది. దీంతో తామిరబరణి నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ ఇలా భగవత్ సూచించారు.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.