తెలుగు సినీ పరిశ్రమ పైరసీ సమస్యతో కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే iBOMMA, Bappam TV వంటి సైట్లను అధికారులు బ్లాక్ చేయగా, వాటి నిర్వాహకులపై దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే పరిస్థితి మారకుండానే పైరసీ మాఫియా తమ మార్గాలు మార్చుకుంటూ తిరిగి యాక్టివ్ అవుతోంది. ఇప్పుడు MovieRulz అదే ధోరణిలో పోలీసులకు ప్రత్యక్ష సవాల్ విసురుతోంది.
ఇటీవల శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే MovieRulz ప్లాట్‌ఫారంలో ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యంగా థియేటర్లలో కెమెరాతో రికార్డ్ చేసిన 'క్యామ్ ప్రింట్లను' కొన్ని గంటల్లోనే అప్లోడ్ చేశారు. దీంతో సినిమాలు రిలీజ్ డే నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడం నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతోంది.
పైరసీ ద్వారా ఒక సినిమా విజయం, కలెక్షన్‌లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు, తక్కువ బడ్జెట్ మూవీస్‌కి పైరసీ పెద్ద ముప్పుగా మారింది. ప్రమోషన్, రిలీజ్‌పై భారీ ఖర్చు పెట్టినా.. పైరసీ కారణంగా కలెక్షన్‌లు పడిపోవడంతో చాలా మంది నిర్మాతలు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే పైరసీ గ్యాంగ్‌లపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. iBOMMA వ్యవస్థాపకుడు రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ MovieRulz మాత్రం నిర్భయంగా పనిచేయడం గమనార్హం. సైట్ తరచూ డొమైన్ మార్చడం, VPN, డార్క్‌వెబ్, ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించడం వలన పోలీసులకు వీరిని పూర్తిగా అరికట్టడం కష్టంగా మారుతోంది.
సైబర్ నిపుణుల ప్రకారం MovieRulz ప్రస్తుతం గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా నడుస్తోంది. ఒక డొమైన్ బ్లాక్ చేసినా వెంటనే మరో కొత్త డొమైన్‌తో మళ్లీ యాక్టివ్ అవుతోంది. అందుకే పోలీసులు, సైబర్ సెల్MovieRulzను పూర్తిగా కూల్చడానికి అంతర్జాతీయ లీగల్ సపోర్ట్ అవసరమని భావిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీ మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. “ఒక సినిమాని సృష్టించడానికి వందలాది మందికి ఎన్నో నెలలు కష్టపడాలి. కానీ పైరసీ కారణంగా వారి శ్రమ కేవలం గంటల్లోనే వృథా అవుతోంది’’ అంటూ నిర్మాతలు, డైరెక్టర్లు స్పందిస్తున్నారు.
పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. త్వరలో మరింత కఠిన నిబంధనలు రావచ్చని సమాచారం. సినిమాను థియేటర్లో చూసినప్పుడే అసలు అనుభవం ఉంటుంది. పైరసీని ప్రోత్సహించకుండా సినిమాను చట్టబద్ధంగా చూసే అలవాటు ప్రతి ప్రేక్షకుడిలో రావాల్సిన అవసరం ఉంది.