ఉచిత విద్యుత్ పథకం కింద వారికి కరెంట్ బిల్లులు అందజేత..
ఉచిత విద్యుత్ పథకం ద్వారా నేతన్నలకు సంవత్సరానికి రూ.8,640 వరకు లాభం..
శ్రీసత్యసాయి జిల్లా: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూ, వారి ఆదాయం పెంచడంతో పాటు ఆరోగ్య భద్రతను కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.
ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లిలో పలువురు చేనేత కుటుంబాలను మంత్రి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ పథకం కింద వారికి కరెంట్ బిల్లులను అందజేసి, ఆ పథకం వల్ల కలిగిన ప్రయోజనాలను తెలుసుకున్నారు. చేనేత కుటుంబాలు జీరో పేమెంట్ బిల్లులను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, ఉచిత విద్యుత్ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720, సంవత్సరానికి రూ.8,640 వరకు లాభం కలుగుతుందని చెప్పారు. మరమగ్గం మీద పని చేసే కుటుంబాలకు నెలకు రూ.1,800, సంవత్సరానికి రూ.21,600 వరకు ఆదా అవుతుందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55,405 మగ్గం నేతన్నల కుటుంబాలు, 8,611 మరమగ్గం కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని, మిగిలిన అర్హులకూ ఈ ప్రయోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. చేనేత ఉత్పత్తులను పెంచడం, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం లక్ష్యంగా టెక్స్‌టైల్ పార్కులు, మెగా మరియు మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారికి ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
అదేవిధంగా, 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు రూ.4,000 పెన్షన్ అందజేస్తున్నామని, త్రిఫ్ట్ ఫండ్ కోసం ప్రతి సంవత్సరం రూ.5 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ముద్ర రుణాలు, 15% సబ్సిడీతో నూలు, 90% సబ్సిడీతో మగ్గం పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో ద్వారా ఎగ్జిబిషన్లు నిర్వహించి అమ్మకాలు పెంచడమే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా చేనేత ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేస్తున్నామని వివరించారు.
చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ యూనివర్శల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురానున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
మంత్రి సందర్శన సందర్భంగా చేనేత కుటుంబాలు ఆమెను ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.