మాజీ మంత్రి విడుదల రజిని గారు నీతులు మాట్లాడటం హాస్యాస్పదం..
వైసీపీది గొడ్డలి సంస్కృతి అనడంలో ఎటువంటి సందేహం లేదు..
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి విడదల రజిని వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ, “వైసీపీది గొడ్డలి సంస్కృతి” అని వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన, రౌడీయిజం పెరిగిందని, అందుకే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారు అన్నారు. ఎన్నికల ముందు “ఒక్క అవకాశం” అంటూ ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు.
అన్నా క్యాంటీన్లను మూసివేయడం పేదవాడి పొట్టపై గొడ్డలితో నరకడమేనని ఆయన ఆరోపించారు. అలాగే పెన్షన్ హామీల విషయంలో కూడా ప్రజలను మోసం చేశారని, రూ.3000 ఇస్తామని చెప్పి క్రమంగా పెంచుతూ కాలయాపన చేశారని అన్నారు. మైనారిటీ విద్యార్థులకు అందాల్సిన పథకాలను నిలిపివేసి, వారి భవిష్యత్తును దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అనేక హత్యలు, దాడులు జరిగాయని నసీర్ అహ్మద్ ఆరోపించారు. వివిధ సంఘటనలను ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడం కోసం హింసాత్మక మార్గాలను అనుసరించారని అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని “గొడ్డలి పార్టీ” అని పిలవడం సరైనదేనని వ్యాఖ్యానించారు.
అలాగే, సొంత కుటుంబ సభ్యులపై కూడా వివాదాలు తెచ్చుకున్న నాయకత్వం ఇది అని, “కిల్లింగ్ మైండ్ సెట్”తో వ్యవహరించారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను మాత్రమే కాకుండా, తమ పార్టీలో ఉన్న వారినే వేధించిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం, పేదల సమస్యలను పట్టించుకోకపోవడం, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడం— ఇవన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని, అందుకే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు.
ఇప్పటికైనా మాజీ మంత్రి విడదల రజిని వంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, “మీరు చేసింది పాలన కాదు… అరాచకం” అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు.