కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు..
అమరావతి, మే 3: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 46.2°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1°C నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభంలో 45.7°C, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 45.6°C, పల్నాడు జిల్లా నడిగడ్డలో 44.2°C, బాపట్ల జిల్లా కారంచేడులో 44°C, కర్నూలు జిల్లా తోవిలో 43.9°C, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం తెరన్నపల్లి, కడప వీరబల్లెలో 43.4°C, నంద్యాల బనగానపల్లె, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 43.1°C నమోదయ్యాయి.
మొత్తం 28 జిల్లాల్లో 16 జిల్లాలకు చెందిన 286 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్ర ప్రభావం కనిపించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కడప, నెల్లూరు జిల్లాల్లో 33 మండలాలు చొప్పున, తిరుపతి 31, ప్రకాశం 28, పల్నాడు 25, మార్కాపురం 21, నంద్యాల 20, చిత్తూరు 20, కర్నూలు 18, బాపట్ల 16 మండలాల్లో ఎండలు అధికంగా నమోదయ్యాయి.
సోమవారం (మే 4) రాష్ట్రంలోని 27 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, వంగర; పార్వతీపురం మన్యం జిల్లాలో పలుమండలాలు; పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో సోమవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగులు ఉన్న సమయంలో పొలాల్లో పని చేసే వారు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.
మరోవైపు ఆదివారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7 మిమీ, కాట్రేనికోనలో 57.7 మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2 మిమీ, పిఠాపురంలో 45.5 మిమీ, కాకినాడ రూరల్‌లో 43 మిమీ, అచ్చుతాపురంలో 42 మిమీ, కాకినాడ అర్బన్‌లో 41 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎండలు, వడగాలులు ఒకవైపు, పిడుగులతో వర్షాలు మరోవైపు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.