Chandrababu: ఇంటింటికీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చేర్చాలి.. 45 రోజుల డోర్ టు డోర్ ప్రచారానికి సీఎం చంద్రబాబు పిలుపు!
Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే 45 రోజుల డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంను సమర్థవంతంగా నిర్వహించాలని టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు..
ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వివరించండి.. నాయకులకు చంద్రబాబు సూచనలు..
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు పిలుపునిచ్చారు. 45 రోజుల డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంను సమర్థవంతంగా నిర్వహించాలని టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారని చంద్రబాబు గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో ప్రజలు అపూర్వమైన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పరిపాలన అందిస్తోందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
గత ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గత పాలనలో జరిగిన తప్పిదాలు, విధ్వంసకర నిర్ణయాల కారణంగానే ఒకప్పుడు 151 అసెంబ్లీ స్థానాలు గెలిచిన పార్టీ 11 స్థానాలకు పరిమితమైందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ప్రజలకు వాస్తవాలను వివరించాలని, గత ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు కోరారు. ప్రజలకు నచ్చని, వారు మెచ్చని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని పార్టీ నాయకులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కొనసాగడం అవసరమని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలని ఆయన అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి మరోసారి ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అదే సమయంలో గత పాలనలో యువతకు జరిగిన నష్టాలను, అవకాశాలు ఎలా దెబ్బతిన్నాయో కూడా ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు.
ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారాలు, విధ్వంసకర రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా ఇప్పటికీ సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి రాజకీయాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికీ వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
45 రోజులపాటు జరిగే ఈ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన హామీలు, భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు చేరవేసేలా పార్టీ నాయకులు పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Be the first to react