రైలు ప్రయాణం అనేది ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఒక గుర్తుగా నిలుస్తుంది. ఎంతోమంది జీవితాల్లో భావోద్వేగాల్ని మిగిల్చే రైలు ప్రయాణం, ఒక్కోసారి చక్కటి అనుభూతిని అందిస్తే, మరికొన్ని సార్లు ఇబ్బందులకూ కారణమవుతుంది. అయినప్పటికీ, రైలు అంటే ఒక్క ఎమోషన్‌నే. ఇలాంటి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సమయపాలనతో చేయాలని భారతీయ రైల్వే ఎన్నో చర్యలు చేపడుతోంది.
ఈ దిశగా, అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి రైల్వే జంక్షన్లలో ఆధునిక వసతుల అమరికకు రూ.47.69 కోట్లను కేటాయించారు. ప్రయాణికులకు తరచూ ఎదురయ్యే రైలు ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, ఇక్కడ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పనులకు కాంట్రాక్టులు కేటాయించగా, నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ప్రస్తుతం గుంతకల్లు స్టేషన్‌లో ఉన్న మూడు సిగ్నలింగ్ క్యాబిన్ల స్థానంలో ఒకే ఒక అడ్వాన్స్‌డ్ సిగ్నలింగ్ క్యాబిన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కంప్యూటరైజ్డ్ విధానంలో పని చేస్తూ, డేంజర్ సిగ్నల్స్ దాటి వెళ్లే ప్రమాదాలను నివారించగలదు. తద్వారా ప్రమాదాల రిస్క్ తగ్గుతుంది.
అయితే, ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అమలు ముందు గుంతకల్లు యార్డు విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ అమలు చేయగలమని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, రైలు ప్రయాణంలో భద్రత, సమయపాలనకు ఇది పెద్ద మైలురాయిగా మారనుంది.