సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అక్కడి తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సింగపూర్ ఎలా అభివృద్ధి చెందినదో చూస్తే, మన రాష్ట్రం కూడా అలాంటి మార్గంలో సాగేందుకు మార్గదర్శనం అవుతుంది. సింగపూర్ అభివృద్ధి తీరు మనకు ప్రేరణగా నిలవాలి" అని అన్నారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధికి బదులు విధ్వంసమే జరిగింది అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ముందుకు వచ్చారని, వారి పాత్ర అభినందనీయమని అన్నారు. "ప్రతి విదేశీ పర్యటనలో ముందుగా అక్కడి తెలుగు వారిని కలవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే, వారి మద్దతు, సలహాలు, పెట్టుబడులు రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో అవసరం" అని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇక్కడున్న తెలుగువారు రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా పెట్టుబడులు తేవాలని, తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని వినియోగించాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లేందుకు ఇది సమయమని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మంత్రి లోకేశ్ అన్నారు.