ఆంధ్రప్రదేశ్‌లో భూవ్యవహారాలను మరింత సులభతరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నేరుగా కొరియర్ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రజలకు సమయం ఆదా అవుతుందని, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పదే పదే రావాల్సిన అవసరం ఉండదని సీఎం తెలిపారు.
కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను వెంటనే జారీ చేయాలని, రికార్డుల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భూముల వ్యవహారాల్లో రాజకీయ జోక్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భూసంబంధిత రికార్డుల డిజిటలీకరణ అత్యంత అవసరమని సీఎం స్పష్టం చేశారు. డిజిటల్ రికార్డుల వల్ల భద్రత పెరుగుతుందని, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నివారించవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా ఇంటికి పంపడం వల్ల ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని, ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదే సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా కీలక విషయాలు వెల్లడించారు. భూరికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలను పూర్తిగా డిజిటలైజ్ చేసి క్లౌడ్‌లో భద్రపరుస్తున్నామని తెలిపారు. 2019–24 మధ్య కాలంలో కొన్ని భూములను తప్పుగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ సమస్యలను నిర్దేశిత గడువులో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.
22ఏ కింద ఉన్న భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొన్ని ఇళ్లు కూడా 22ఏలో ఉన్నాయని గుర్తుచేస్తూ, అక్కడ నివసిస్తున్న వారికి హక్కులు కల్పించాలని సూచించారు. 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములను 22ఏ నుంచి విముక్తి చేయాలని ఆదేశిస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.