Pithapuram Railway Station: నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే పిఠాపురం రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త హంగులతో మెరిసిపోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద ఈ స్టేషన్‌ను ఎంపిక చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 37.25 కోట్ల భారీ నిధులతో స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరు కావడం విశేషం.
గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించిన సమయంలో రైల్వే స్టేషన్ దుస్థితిని స్వయంగా గమనించారు. ప్లాట్‌ఫారాలపై అపరిశుభ్రత, సరైన వసతులు లేకపోవడంపై ఆయన అప్పట్లోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జనవరిలో ఢిల్లీ వెళ్లిన ఆయన, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి పిఠాపురం ప్రాముఖ్యతను వివరించారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన పిఠాపురానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారని, అటువంటి చోట స్టేషన్ అధ్వాన్నంగా ఉండటం తగదని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, వెంటనే అమృత్ భారత్ పథకంలో పిఠాపురాన్ని చేర్చింది. ఈ నిధులతో స్టేషన్ భవనాన్ని ఆధునీకరించడంతో పాటు, ప్రవేశ ద్వారాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులు సేదతీరేందుకు అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, కొత్త కేబులింగ్ ప్లాట్‌ఫారాల విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు. వర్షం వచ్చినా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్లాట్‌ఫారాల పైకప్పులను ఆధునీకరిస్తారు. రైల్వే స్టేషన్ లోపలే కాకుండా, స్టేషన్ బయట కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ పనులు పూర్తయితే పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక కార్పొరేట్ విమానాశ్రయాన్ని తలపించేలా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి, నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు రైల్వే యంత్రాంగం సిద్ధమవుతోంది.