ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇవాళ రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కార్యకర్తలతో ఫోటోలు దిగారు. యువ నేతగా లోకేశ్‌కు ఉన్న ఆదరణ ఈ స్వాగతంలో స్పష్టంగా కనిపించింది.
పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. విద్యా మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలక అడుగుగా పేర్కొనబడుతోంది. అనంతరం అక్కడి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆశలు తెలుసుకున్నారు. విద్యార్థుల సూచనలను గమనించి, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
అనంతరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వెళ్లిన మంత్రి లోకేశ్ అక్కడ కూడా పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు, పరిశోధన, నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్యను ఉపాధితో అనుసంధానం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, యువతకు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.
తర్వాత రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ముందుగా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ కార్యకర్తలతో సమావేశమై, వారి సేవలను అభినందించారు. అనంతరం ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని, రాబోయే రోజుల్లో మరింత చురుకుగా పనిచేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.