సౌమ్యులు, వివాదరహితులు, సేవా భావం, స్నేహశీలి డా. గురు రాజా! ప్రవాసుల డబ్బు కాదు.. వారికి 'సేవ' ముఖ్య లక్ష్యం! గ్లోబల్ NRI TDP అధ్యక్షులు
Global NRI TDP: ఇటీవల తెలుగుదేశం పార్టీ అధిష్టానం Global NRI TDP కమిటీని 45 మంది సభ్యులతో ప్రకటించడం జరిగింది. ఈ 45 సభ్యులు ఈ నెల 9వ తేదీన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవల తెలుగుదేశం పార్టీ అధిష్టానం Global NRI TDP కమిటీని 45 మంది సభ్యులతో ప్రకటించడం జరిగింది. ఈ 45 సభ్యులు ఈ నెల 9వ తేదీన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ పిల్లారిశెట్టి గురురాజా గారు అమెరికా లోని ఒడిసిలో ఉంటారు. సౌమ్యులు వివాదరహితుడు, స్నేహశీలి, మరియు మంచి మనసు ఉన్న వీరు మరియు వీరి కమిటీ సభ్యులు ప్రవాసాంధ్రుల కోసం సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసుకొని ముందుకు సాగనున్నారు.

గురు రాజా గారు గత 20 సంవత్సరాలకు పైగా టీడీపీలో అత్యంత క్రియాశీలకంగా ఉంటూ, విదేశాల్లో పార్టీ విస్తరణకు మరియు తెలుగువారి ఐక్యతకు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, ప్రతి కార్యకర్తను కలుపుకు పోయే నాయకత్వ లక్షణాలు ఉండబట్టే పార్టీ అధిష్ఠానం ఆయనపై పూర్తి నమ్మకంతో గ్లోబల్ ఎన్నారై విభాగానికి అధ్యక్ష బాధ్యతలు వీరికి వరించాయి అని అనడంలో ఏ విధమైన సందేహం లేదు. వీరి గురించి మరియు వీరి ఆధ్వర్యంలో నడవ బోయే ఈ కమిటీ యొక్క ఆలోచనలు మరియు కొన్ని కార్యాచరణ ప్రణాళికలు ఈ విధంగా ఉండనున్నాయి.
డా. గురురాజా పూర్వీకులు చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కనకంపాలెం గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి విద్యాశాఖలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా సేవలందించగా, గురురాజా జననం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.
తండ్రి ఉద్యోగరీత్యా ఆయన కుటుంబం కోయిలకుంట్లకు మారడంతో, గురురాజా పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్య అక్కడే సాగింది. స్థానిక ప్రజలతో, గ్రామీణ వాతావరణంతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడింది.

ఉన్నత విద్య కోసం కర్నూలు మెడికల్ కాలేజీలో చేరిన గురురాజా, 1983లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం 1987 వరకు అదే వైద్య కళాశాలలో ఈఎన్‌టీ (ENT) విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే 1986లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JUDA) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూనియర్ వైద్యుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారంలో పోరాడి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నారు.
1991లో అమెరికా వెళ్లిన గురురాజా, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ఫ్లషింగ్ మెడికల్ సెంటర్‌లో గైనకాలజీ విభాగంలో రెసిడెన్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత టెక్సాస్‌లోని ఒడెస్సా పట్టణంలో సొంత వైద్య కేంద్రాన్ని ప్రారంభించి విజయవంతమైన వైద్యుడిగా స్థిరపడ్డారు.

ఆయన సతీమణి డాక్టర్ ఉషారాణి గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థిని కాగా, ఒడెస్సా క్లినిక్‌లోనే ఇంటర్నల్ మెడిసిన్ నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. వీరి కుమారుడు కార్తీక్ వాషింగ్టన్ డీసీలో అమెరికా ఫెడరల్ ప్రభుత్వ న్యాయవాదిగా, కుమార్తె కీర్తి యూటీ డల్లాస్‌లో పబ్లిక్ హెల్త్ పీజీ విద్యార్థిగా కొనసాగుతున్నారు.
అమెరికాలో ఎంతటి ఉన్నత స్థితికి చేరుకున్నా స్వస్థలమైన కోయిలకుంట్లను గురురాజా విస్మరించలేదు. 'గురురాజా మిత్రమండలి'ని స్థాపించి గడచిన 12 ఏళ్లుగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు ఉచిత వైద్య సహాయం, ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు.
కులవృత్తుల వారిని ఆదుకోవడంలో భాగంగా కోయిలకుంట్ల పరిసరాల్లో ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలు నెలకొల్పి, మహిళలకు ఉపాధి కల్పించారు. ఏటా సుమారు రూ. 50 లక్షలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం కేటాయిస్తూ ఎందరో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం (1982) నుంచే ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ చేపట్టిన చైతన్య రథయాత్రల్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు.
1983 సార్వత్రిక ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. కేఈ కుటుంబంతో రాజకీయ, వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగిస్తూ పార్టీ పటిష్టతకు సహకరించారు.
అమెరికాలో ఉన్నప్పటికీ స్వదేశంలో పార్టీ మిత్రులకు, స్థానిక ఎన్నికల సమయంలో ఆర్థిక వనరుల సమకూర్పులో నిరంతరం తోడ్పాటు అందించారు. 2005లో నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన సందర్భంగా ఆయనతో పరిచయం ఏర్పడి మరింత బలపడింది.
2013లో నారా లోకేష్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత టీడీపీ వ్యవహారాల్లోనూ, ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల్లో ఆయన మరింత చురుగ్గా పాల్గొనేవారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఎన్నారై తెదేపా విభాగాలను ఒకే తాటిపైకి తీసుకురావడమే డాక్టర్ గురురాజా గారి ప్రథమ లక్ష్యమని అనేక సందర్భాల్లో ఆయన తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు దేశాల్లో స్వతంత్రంగా లేదా సమన్వయం లేకుండా నడుస్తున్న బృందాలను ఏకం చేయడానికి దాదాపు 45 మంది సభ్యులతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులను ఒకే తాటిపై చేర్చి, పార్టీ నాయకత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని ఆయన యోచిస్తున్నారు.

విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు తమ సొంత ఊళ్లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక సహాయ వేదికను నిర్మించాలని ఆయన సంకల్పించినట్లు తెలుస్తుంది. ఎన్నారైలు స్వదేశంలో లేకపోవడం వల్ల వారి స్థలాలు, ఆస్తుల వ్యవహారాలు, కుటుంబ లేదా ప్రభుత్వ కార్యాలయాల పనుల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... అలాంటి వారికి అండగా నిలబడి, సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఒక అధికారిక భరోసా వ్యవస్థను పార్టీ ద్వారా అందించాలని యోచిస్తున్నట్లు అర్థమవుతోంది.
రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సంకోచించే ప్రవాసాంధ్రులను సైతం భాగస్వాములను చేయడమే ఆయన మరో ముఖ్య ప్రణాళిక అని అనేక వేదికలపై పునరుద్ధరించారు. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్ పట్ల గౌరవం ఉన్నప్పటికీ, చాలామంది వైద్యులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, మేధావులు సాధారణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు... అలాంటి ప్రతిభావంతుల కోసం వేర్వేరు వేదికలను రూపొందించి, రాజకీయాలకతీతంగా వారు తమ ఆలోచనలు, సలహాలు, నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పంచుకునేలా వాతావరణం కల్పించాలని ఆయన భావిస్తున్నారు.
సొంత రాష్ట్ర అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎన్నారైల నుంచి నిధులను సరిగ్గా మళ్లించాలన్నది ఆయన ప్రధాన ఉద్దేశమని ఇప్పటికే ఆయన 'గురురాజా మిత్రమండలి' ద్వారా కర్నూలు జిల్లా కోయిలకుంట్ల ప్రాంతంలో ఏటా సుమారు రూ. 50 లక్షలు వెచ్చించి విద్యార్థులకు ఉపకారవేతనాలు, వైద్య సహాయం, మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ అందిస్తున్నారు. ఇదే తరహాలో విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తమ స్వగ్రామాల్లోని బడులు, ఆసుపత్రులు, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాల అభివృద్ధి కోసం క్రమపద్ధతిలో విరాళాలు, తోడ్పాటు అందించేలా ప్రోత్సహించాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో, ముఖ్యంగా పెట్టుబడులు మరియు ఆధునిక సాంకేతికతను తీసుకురావడంలో ప్రవాసాంధ్రులను ప్రధాన రాయబారులుగా మార్చాలని గురురాజా గారు యోచిస్తున్నట్లు పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు, స్టార్టప్‌లకు మార్గదర్శనం చేయడానికి విదేశీ తెలుగు పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నదే ఆయన కర్తవ్యం అని అనేక సందర్భాల్లో వెల్లడించారు. మొత్తంగా ఎన్నారై తెదేపాను కేవలం ఎన్నికల ప్రచారాలకే పరిమితం చేయకుండా, ప్రవాసాంధ్రుల బాగోగులు చూస్తూనే రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో వారిని కీలక భాగస్వాములుగా నిలిపే ఒక సేవారంగ వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఆయన భవిష్యత్ లక్ష్యమని అనేక సందర్భాలలో తెలిపారు.
డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడుగా పార్టీ మరింత ముందుకు సాగుతోందని ఆశిస్తూ "ఆంధ్రప్రవాసి" తరఫున వారికి మరియు వారి కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
Be the first to react
