Nara Lokesh: పార్టీ కోసం పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయి.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!

Nara Lokesh: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌ను కీలకంగా భావించి పనిచేయాలని, ప్రతి గడపను తట్టి ప్రజలతో మమేకం కావాలని సూచించారు.

Nara Lokesh
Nara Lokesh

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: నారా లోకేష్..

పార్టీ కోసం పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయి: నారా లోకేష్..

నర్సరావుపేట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌ను కీలకంగా భావించి పనిచేయాలని, ప్రతి గడపను తట్టి ప్రజలతో మమేకం కావాలని సూచించారు.

నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహిస్తామని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత జగన్‌పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. 2019లో తన బాబాయిని హత్య చేసి, ఆ నెపాన్ని చంద్రబాబుపై మోపేలా ప్రచారం చేశారని ఆరోపించారు. తన తమ్ముడిని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలకు తెలుసని విమర్శించారు.

మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో చెన్నారెడ్డి అనే వ్యక్తి మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. జగన్ ఆ ఘటనపై ప్రభుత్వాన్ని, టీడీపీని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో స్పందించారని తెలిపారు. అయితే చెన్నారెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డితో జగన్ మాట్లాడినప్పుడు, తన కుమారుడిని గొడ్డలి పార్టీ కార్యకర్తలే చంపారని చెప్పినట్లు లోకేష్ పేర్కొన్నారు.

టీడీపీకి తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయని అన్నారు. వైసీపీపై విమర్శలు చేస్తూ, ఆ పార్టీలో గంజాయి, బూతులు, మహిళలను అవమానించే సంస్కృతికి సంబంధించిన అనుబంధ విభాగాలు ఉన్నాయని ఆరోపించారు.

టీడీపీలో రెండో, మూడో తరం నాయకత్వం ఎదుగుతోందని చెప్పారు. వైసీపీలో భూకబ్జాలు, హిట్ అండ్ రన్, మహిళలను వేధించే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఉన్నారని విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

పల్నాడుకు ముఖద్వారంగా, పౌరుషాల పురిటిగడ్డగా నర్సరావుపేటకు ప్రత్యేక గుర్తింపు ఉందని లోకేష్ అన్నారు. అనేక మంది ప్రముఖ నాయకులను ఈ ప్రాంతం రాష్ట్రానికి అందించిందని గుర్తుచేశారు.

ఏపీ తొలి స్పీకర్ వెంకట్రామయ్య చౌదరి, ఉమ్మడి రాష్ట్ర మూడో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద్ వంటి నాయకులు ఈ ప్రాంతం నుంచి ఎదిగారని తెలిపారు.

టీడీపీ ఆవిర్భావానికి ముందు పల్నాడు ప్రాంతం ఫ్యాక్షనిజానికి పేరొందిందని, కోడెల శివప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి అభివృద్ధిపై దృష్టి పెట్టారని చెప్పారు.

2019లో ఓటమి ఎదురైనా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కార్యకర్తలకు అండగా నిలిచి తిరిగి విజయం సాధించారని లోకేష్ అన్నారు. నర్సరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే కలిసి సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.

టీడీపీలో వర్గాలు ఉండవని, ‘తెలుగుదేశం’ అనే ఒకే వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. వర్గాల పేరుతో పార్టీ కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాను రాష్ట్ర మంత్రిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం కార్యకర్తలే అని లోకేష్ అన్నారు. కార్యకర్తలు లేకపోతే తాను ఎవరో కాదని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించడం తన బాధ్యత అని, పార్టీ కోసం పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయి అన్నారు.

2025 మహానాడులో తనకు అత్యంత ఇష్టమైన నినాదం ‘కార్యకర్తే అధినేత’ అని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను అధినేత పక్కన కూర్చోబెట్టి, మంత్రులను కింద కూర్చోబెట్టామని గుర్తుచేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తే ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, పదవులే కార్యకర్తలను వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు.

డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని లోకేష్ విమర్శించారు. డీఎస్సీపై 150 కేసులు వచ్చినప్పటికీ 150 రోజుల్లోనే మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. భవిష్యత్‌లో మరో మూడు డీఎస్సీలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.

డీఎస్సీపై జగన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉంటే ధైర్యంగా చర్చకు రావాలని లోకేష్ సవాల్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం కాకుండా వాటిని ఆధారాలతో నిరూపించాలని అన్నారు.

రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసే బాధ్యతను కూడా తీసుకుంటానని చెప్పారు. లక్షలాది మంది యువత కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని లోకేష్ తెలిపారు. టీడీపీ కోటి మంది సభ్యులతో కూడిన పెద్ద కుటుంబమని అన్నారు. కార్యకర్తలకు ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్ కీలకమని చెప్పారు. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా పార్టీ కోసం చురుగ్గా పనిచేసే కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు.

పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, చేసిన పనిని మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. క్లస్టర్, యూనిట్ నాయకులకు ఇప్పటికే కేంద్ర కార్యాలయంలో శిక్షణ ఇచ్చామని చెప్పారు.

శిక్షణకు వచ్చిన కార్యకర్తలకు రక్త పరీక్షలు నిర్వహించగా సుమారు 75 శాతం మందిలో వివిధ ఆరోగ్య సమస్యలు గుర్తించామని లోకేష్ తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తామని, జీవితాంతం అవసరమైన మందులు అందించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. అయితే కార్యకర్తలు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని లోకేష్ ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 10 శాతం తగ్గించి, సుమారు 17 వేల పదవులకు బీసీలను దూరం చేశారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని కూడా వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

2019-24 మధ్య కాలంలో బీసీ వర్గాలకు చెందిన పలువురిని వైసీపీ నాయకులు హత్య చేశారని లోకేష్ ఆరోపించారు. రేపల్లెలో తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్‌పై కిరోసిన్ పోసి తగులబెట్టారని పేర్కొన్నారు. తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య హత్యలను కూడా ప్రస్తావించారు.

మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రమాదం తర్వాత మరొక వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి యాదవ సామాజిక వర్గానికి చెందినవాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదని విమర్శించారు.

మద్యం అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను కూడా లోకేష్ ప్రస్తావించారు. ఈడీ చర్యలకు కూడా తమపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాల విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరో నెల రోజుల్లో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి స్థానంలో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు.

ప్రస్తుతం టీడీపీ జనసేన, బీజేపీతో కలిసి ముందుకు సాగుతోందని చెప్పారు. 2029లోనే కాకుండా మరో మూడు పర్యాయాలు కూడా కూటమిగానే కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి పార్టీల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ‘నో మిస్‌ఫైర్.. నో క్లాస్‌ఫైర్’ అనే విధానంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జీతాలు, పెన్షన్లకు కేంద్రం నుంచి సహకారం ఉందని పేర్కొన్నారు.

కార్యకర్తలు అహంకారం, ఈగోలకు దూరంగా ఉండాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండాలని సూచించారు. ఎన్నికల్లో విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రతి గడపను తట్టి ప్రజలను కలవాలని, డోర్ టు డోర్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

‘రెడ్‌బుక్’ అంశంపై కూడా లోకేష్ మరోసారి స్పష్టత ఇచ్చారు. కొందరు రెడ్‌బుక్ పేరుతో భయపడుతున్నారని అన్నారు. ఇది కార్యకర్తలకు ఇచ్చిన హామీ మాత్రమే కాదని, యువగళం కార్యక్రమంలో సుమారు వంద సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

నర్సరావుపేట ఐటీఐకి అవసరమైన సిబ్బందిని నియమించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరగా, నూటికి నూరు శాతం సిబ్బందిని అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నర్సరావుపేటకు యూనివర్సిటీ మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడాల్సి ఉందన్నారు.

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. లోకేష్ చొరవతో రాష్ట్రానికి గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయని అన్నారు. నర్సరావుపేట జేఎన్‌టీయూ కళాశాలలో రూ.70 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు. జేఎన్‌టీయూ నర్సరావుపేటను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.

ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు జానీ సైదా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest