Jonnagiri Gold Fields: 400 కోట్ల పెట్టుబడి, 50 టన్నుల నిల్వలు... ఏపీకి కొంగు బంగారంగా జొన్నగిరి!
Jonnagiri Gold Fields: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న జొన్నగిరి ప్రాంతంలో (JGF) 'జియో మైసూర్' అనే ప్రైవేట్ సంస్థ 400 కోట్ల పెట్టుబడితో భారీ బంగారు గనుల ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ దాదాపు 50 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతి ద్వారా ఏడాదికి 1000 కిలోల (ఒక టన్ను) మేలిమి బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నారు. జూన్ 24, 2026 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తుది ఉత్పత్తి (ఫైనల్ ప్రొడక్షన్) కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
- దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని.. జియో మైసూర్ సంస్థ సంచలనం.
- 400 కోట్ల పెట్టుబడి, 50 టన్నుల నిల్వలు: ఏపీకి కొంగు బంగారంగా జొన్నగిరి!
- కర్నూలు జిల్లాలో భారీ గోల్డ్ ప్రాజెక్ట్.. ఏటా ఒక టన్ను బంగారం వెలికితీత
Jonnagiri Gold Fields: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటినుంచో అపారమైన ఖనిజ సంపదకు నిలయంగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, హోప్ లాంటి అత్యంత విలువైన వజ్రాలు దొరికింది మన గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల్లోనే కావడం మనందరికీ గర్వకారణం. వజ్రాలకే కాకుండా ఇప్పుడు బంగారం వెలికితీతలో కూడా ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఒకప్పుడు కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో, ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్న 'జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్' (JGF) కూడా భారతదేశంలోనే ఒక అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా మారబోతోంది.
కర్నూలు జిల్లా పరిధిలోని జొన్నగిరి, ఎర్రగుడి, రామగిరి ప్రాంతాల్లో భూమి లోపల పెద్ద ఎత్తున బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఇతర పరిశోధనల్లో తేలింది. దీనిని వెలికితీసే బాధ్యతను 'జియో మైసూర్' అనే ప్రైవేట్ సంస్థ తీసుకుంది. భారతదేశంలో బంగారం తవ్వకాలు చేపడుతున్న మొట్టమొదటి భారీ ప్రైవేట్ సంస్థగా జియో మైసూర్ చరిత్రకెక్కనుంది. ఇక్కడ తుది ఉత్పత్తి కార్యకలాపాలు (ఫైనల్ ప్రొడక్షన్ యాక్టివిటీ) జూన్ 24, 2026 వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాబోతుండటం పారిశ్రామిక రంగానికి ఒక శుభపరిణామం.
ఈ ప్రాజెక్టు కోసం జియో మైసూర్ సంస్థ ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని పెట్టింది. ఈ జొన్నగిరి గనుల్లో సుమారు 50 టన్నుల మేర భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం 1000 కిలోల (ఒక టన్ను) మేలిమి బంగారాన్ని వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంవత్సరానికి ఒక టన్ను చొప్పున తీసినా కూడా, కనీసం 50 సంవత్సరాల పాటు ఇక్కడ నిరంతరంగా మైనింగ్ కార్యకలాపాలు జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. మొదటి 8 నుంచి 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా భారీ ఆదాయం వస్తుందని సంస్థ బలంగా విశ్వసిస్తోంది.
ఇక్కడ బంగారం తవ్వకాలను బొగ్గు గనుల తరహాలో 'ఓపెన్ కాస్ట్ మైనింగ్' పద్ధతిలో చేపట్టనున్నారు. అంటే భూగర్భంలోకి లోతుగా వెళ్లకుండానే భూమి పైభాగం నుంచే తవ్వకాలు జరుపుతూ ముడి బంగారాన్ని వెలికితీస్తారు. ఇలా తీసిన ముడి ఖనిజాన్ని వివిధ దశల్లో శుద్ధి చేసి ఫైనల్ గా మేలిమి బంగారంగా మారుస్తారు. ఈ భారీ ప్రాజెక్టు వల్ల జొన్నగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల యువతకు పెద్ద ఎత్తున స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మైనింగ్ కు సంబంధించిన అన్ని రకాల పర్యావరణ అనుమతులు మరియు భూసేకరణను సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది.
మన దేశంలో బంగారం వాడకం చాలా ఎక్కువ, కానీ ఉత్పత్తి చాలా తక్కువ ఉండటంతో ప్రతి ఏడాదీ వేలాది కోట్ల రూపాయల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో జొన్నగిరిలో ఏడాదికి వెయ్యి కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల దిగుమతుల భారం కొంతవరకైనా తగ్గుతుంది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (JGF) భవిష్యత్తులో దేశానికే తలమానికంగా, భారతదేశ పటంలో ఒక అత్యంత కీలకమైన 'గోల్డ్ స్పాట్' గా నిలిచిపోవడం ఖాయం. ఈ పసిడి గని నిజంగానే మన ఆంధ్రప్రదేశ్కు ఒక 'కొంగు బంగారం' లాంటి గొప్ప ప్రాజెక్టు అని చెప్పవచ్చు.
Tags
Be the first to react