CM Joseph Vijay: ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు.. కొత్త చిరునామా ఏంటంటే..!

తమిళనాడు సచివాలయంలో ఒక చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలోనే నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి మారనుంది.

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు..
ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు..
  • వేగంగా సాగుతున్న నూతన సీఎం ఆఫీస్ పునర్నిర్మాణ పనులు.. 

  • Politics: నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తులోకి తరలింపు.. 

Joseph Vijay: తమిళనాడు పరిపాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర సీట్ ఆఫ్ పవర్‌గా ఉన్న చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO) నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న పాత కార్యాలయంలో స్థలం కొరత తీవ్రంగా ఉండటంతోనే, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం ఆఫీస్‌ను పదో అంతస్తుకు మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

పాత భవనంలో ఉన్న పరిమిత స్థలం కారణంగా సమీక్షలు, సమావేశాల నిర్వహణతో పాటు సాధారణ ప్రజలను కలవడం కూడా సవాలుగా మారింది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తును ఎంపిక చేయగా, అక్కడి నుంచి బంగాళాఖాతం సముద్ర తీరం స్పష్టంగా కనిపిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో సమీక్షలు నిర్వహించేందుకు అనువుగా ఉండనుంది.

ఈ భారీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పదో అంతస్తులో కార్యకలాపాలు సాగిస్తున్న సమాచార, తమిళ అభివృద్ధి శాఖలతో పాటు హోం, వాణిజ్య పన్నుల శాఖల విభాగాలు, కాన్ఫరెన్స్ హాల్‌లను ఇతర ప్రాంతాలకు రీ-లొకేట్ చేస్తున్నారు. కాగా, 1975లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పది అంతస్తుల భవనం, సచివాలయ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. అధికారుల సమాచారం ప్రకారం, కేవలం పాలనాపరమైన వేగాన్ని, సౌకర్యాన్ని పెంచేందుకే ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

Tags

Be the first to react

Latest