-
కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోని తహశీల్దార్.. ముద్దనూరు ఎంఆర్వో నిర్లక్ష్యంపై మంత్రికి వినతి!
-
దళితుడి భూమిలో వైసీపీ నేత దౌర్జన్యం.. పొలంలో కరెంట్ స్తంభాలు నాటిన ఈశ్వర్ రెడ్డి!
Praja vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ (గ్రీవెన్స్) కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి బాధితులు భారీగా తరలివచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణలు ప్రజల నుండి వినతులను నేరుగా స్వీకరించి, వారి సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ రికార్డుల తారుమారు, వైసీపీ నేతల అక్రమాలు, అధికారుల అవినీతి మరియు కుటుంబ మోసాలపై బాధితులు నేతలకు అర్జీలు సమర్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఈ గ్రీవెన్స్ లో అనంతపురం జిల్లాకు చెందిన తిరుపాలు అనే దళితుడు అర్జీ ఇస్తూ, సిద్ధరాంపురం గ్రామంలోని తన 1.06 ఎకరాల పట్టా భూమిని వైసీపీ నేత టి. ఈశ్వర్ రెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా, తన పొలంలోకి చొచ్చుకొచ్చి అక్రమంగా విద్యుత్ స్తంభాలు నాటించాడని మంత్రికి ఫిర్యాదు చేశారు. స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కూడా సదరు అక్రమార్కుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, తిరుపతి జిల్లాకు చెందిన చెంచురత్నం అనే వృద్ధుడు మాట్లాడుతూ, తమ వంశపారంపర్యంగా వస్తున్న 3.96 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రికార్డులు తారుమారు చేసి వేరొకరి పేరు మీదకు ఆన్లైన్ చేశారని, దానిని మార్చడానికి స్థానిక రెవెన్యూ సిబ్బంది ₹20,000 లంచం తీసుకుని కూడా పని చేయకుండా, మరో రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
మరోవైపు కడప జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి తన 5 ఎకరాల భూమిని పులివెందుల వ్యక్తి పేరుపైకి అక్రమంగా ఆన్లైన్ చేశారని, దీనిపై కడప కలెక్టర్ గత ఆర్డీఓ ఉత్తర్వులను రద్దు చేస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా స్థానిక తహశీల్దార్ వాటిని అమలు చేయడం లేదని విన్నవించారు. కడప జిల్లాకే చెందిన దస్తగిరమ్మ అనే మహిళ తమ 0.29 సెంట్ల భూమిని కులాయిస్వామి అనే వ్యక్తి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్నాడని వాపోయారు. అలాగే నంద్యాల జిల్లా అవుకు చెందిన లక్ష్మీదేవి తమ పూర్వీకుల స్మశాన వాటికగా ఉన్న 48 సెంట్ల భూమిని ఆక్రమించేందుకు కొందరు అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి సమాధులను ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన జంపని సతీష్ తన 48 సెంట్ల భూమిని దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా వేరొకరు మార్చుకున్నారని, కోర్టులో కేసు నడుస్తున్నా దౌర్జన్యాలు ఆపడం లేదని అర్జీ ఇచ్చారు.
భూ సమస్యలతో పాటు కుటుంబ మోసాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై కూడా వినతులు వచ్చాయి. విజయవాడకు చెందిన చదువురాని అమాయక వృద్ధురాలు జానం అన్నపూర్ణ తన మూడో కుమారుడు రామకృష్ణ వీలునామా రాస్తానని నమ్మించి, తన ఇిల్లు, బంగారం, ఆస్తి పత్రాలన్నింటినీ మోసపూరితంగా తన పేరు మీదకు మార్చేసుకుని తనను రోడ్డున పడేశాడని కన్నీటిపర్యంతమయ్యారు. కడప జిల్లా గోపవరం మండలానికి చెందిన వెంకటయ్య తన పొలానికి వెళ్లే దారిని కొందరు మూసివేశారని, దీనికి స్థానిక రెవెన్యూ ఉద్యోగి వత్తాసు పలుకుతూ ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నాడని ఫిర్యాదు చేశారు. సిద్ధవటం మండలానికి చెందిన సుబ్బయ్య తమ కుటుంబం 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 3.68 ఎకరాల డికెటి భూమిని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల రుణాలు అందడం లేదని కోరారు. మార్కాపురానికి చెందిన పఠాన్ ఖురేషి తన 1.15 ఎకరాల భూమిపై ఉన్నతాధికారుల జడ్జిమెంట్లు అనుకూలంగా ఉన్నా, స్థానిక అధికారులు వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఎక్కించడం లేదని విన్నవించారు.
భూమి, ఆస్తి వివాదాలతో పాటు పలువురు బాధితులు పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ సమస్యలపై నేతలకు అభ్యర్థనలు అందించారు. నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం తమ రెస్యూమ్‌లను సమర్పించగా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మరికొందరు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. ఈ అర్జీలన్నింటినీ స్వీకరించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మన్నవ మోహనకృష్ణలు బాధితులకు ధైర్యం చెప్పారు. అర్జీలను తక్షణమే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు పంపి, చట్టప్రకారం విచారణ జరిపించి బాధితులకు త్వరితగతిన పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు.
Tags
Be the first to react