⚡ BREAKING
Politics

AP Investments: నెక్స్ట్ టోక్యోగా ఆంధ్రప్రదేశ్... 23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో సరికొత్త చరిత్ర!

AP Investments: ఒకప్పుడు నిర్మాణంలో వెనుకబడిందని విమర్శలు ఎదుర్కొన్న అమరావతి రాజధాని, ఇప్పుడు దేశంలోనే తొలి 'క్వాంటం వ్యాలీ'గా అవతరించబోతోంది. సుమారు 90 వేల మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించేలా ఇక్కడ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ టెక్ పార్క్ నిర్మిస్తున్నారు.

నెక్స్ట్ టోక్యోగా ఆంధ్రప్రదేశ్
  • 15 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ ఏఐ డేటా సెంటర్.

  • జీరో నుంచి శిఖరానికి.. ఏపీని గ్లోబల్ టెక్ అండ్ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తున్న సీఎం చంద్రబాబు.

  • దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీగా అమరావతి.. 90 వేల మందికి ఐటీ కొలువులు

AP Investments: 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని, సరైన ఐటీ రంగం లేకుండా తీవ్ర నష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు దేశంలోనే ఒక సరికొత్త ఆర్థిక శక్తిగా, 'నెక్స్ట్ టోక్యో'గా మారే దిశగా అడుగులు వేస్తోంది. 1998లో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను రప్పించి ఆ నగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఏపీలో సున్నా నుంచి ఒక సరికొత్త ఐటీ, పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడుల హామీలతో రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. గూగుల్, మెటా లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులు అవుతుండటంతో, ఐటీ మరియు మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం మునుపెన్నడూ లేని విధంగా టెక్నాలజీ మరియు పారిశ్రామిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది.

ఈ భారీ పారిశ్రామిక విప్లవంలో విశాఖపట్నం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ గూగుల్ సంస్థ ఏకంగా 15 బిలియన్ డాలర్ల (లక్ష కోట్లకు పైగా) భారీ పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా ఏకంగా లక్షా ఎనభై ఎనిమిది వేల (1,88,000) ఉద్యోగాలు రానున్నాయి. ముంబై, చెన్నై తర్వాత సింగపూర్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు అమెరికాలకు అనుసంధానించే మూడు కొత్త సబ్‌మెరైన్ ఇంటర్నెట్ కేబుల్స్ విశాఖకు వస్తుండటంతో, ఇది దేశంలో మూడవ అతిపెద్ద ఇంటర్నెట్ గేట్‌వేగా మారుతోంది. ఈ డేటా సెంటర్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుండటంతో మెటా, టాటా, రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఒకప్పుడు నిర్మాణంలో వెనుకబడిందని విమర్శలు ఎదుర్కొన్న అమరావతి రాజధాని, ఇప్పుడు దేశంలోనే తొలి 'క్వాంటం వ్యాలీ'గా అవతరించబోతోంది. సుమారు 90 వేల మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించేలా ఇక్కడ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ టెక్ పార్క్ నిర్మిస్తున్నారు. లండన్‌కు చెందిన ఫాస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అద్భుతమైన డిజైన్లతో ఈ స్మార్ట్ సిటీకి రూపకల్పన చేస్తోంది. అమరావతితో పాటుగా కర్నూలులో దేశంలోనే తొలి డ్రోన్ తయారీ నగరాన్ని (డ్రోన్ సిటీ) నిర్మిస్తుండగా, తిరుపతిలో ఇస్రో (ISRO) శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి అనుసంధానంగా సరికొత్త 'స్పేస్ సిటీ' రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అత్యాధునిక సాంకేతికతకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.

టెక్నాలజీతో పాటే గ్రీన్ ఎనర్జీ మరియు రవాణా రంగాల్లో కూడా ఏపీ అద్భుతాలు సృష్టిస్తోంది. గతంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం కోసం కేటాయించిన విశాఖలోని పూడిమడక ప్రాంతంలో ఇప్పుడు ఏకంగా 21 బిలియన్ డాలర్ల వ్యయంతో ఎన్టీపీసీ (NTPC) సంస్థ ఆసియాలోనే అతిపెద్ద 'గ్రీన్ హైడ్రోజన్ హబ్'ను నిర్మిస్తోంది. మరోవైపు రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం వద్ద ఏకకాలంలో మూడు భారీ పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర కార్గో నిర్వహణ సామర్థ్యం 195 నుంచి 286 మిలియన్ టన్నులకు అమాంతం పెరుగుతుంది. అంతేకాకుండా దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొచ్చిన్ కంటే పెద్దదైన 3500 ఎకరాల భారీ షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫెర్టిలిటీ రేటు తగ్గడం వల్ల యువత శాతం క్రమంగా తగ్గుతోంది. ఉత్తర భారతదేశంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించే ఒక వారధిగా ఏపీ ప్రభుత్వం ఈ భారీ పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తోంది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎస్క్రో (Escrow) అకౌంట్ ద్వారా ఆటోమేటిక్‌గా వంద శాతం స్టేట్ జీఎస్టీ (GST) రిఫండ్ ఇస్తూ, ఎలాంటి అవినీతి లేని పారదర్శకమైన విధానాలను అమలు చేస్తోంది. 2015లో అమరావతి కోసం స్వచ్ఛందంగా 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల భూములు ఇప్పుడు దేశంలోనే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ ప్రాంతాలుగా మారుతున్నాయి. ఈ ప్రణాళికలన్నీ పూర్తిస్థాయిలో అమలైతే ఆంధ్రప్రదేశ్ నిజంగానే దేశానికి ఆర్థిక వెన్నెముకగా మారడం తథ్యం.

Tags

Be the first to react

More Coverage