చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చేపల్లో ఉండే ఓమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, మంచి కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. సాధారణంగా చేపలను కర్రీగా లేదా ఫ్రైగా తింటుంటాం. అయితే నిపుణుల మాట ప్రకారం చేపలను సూప్ (ఫిష్ పాయ సూప్) రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా, శరీరానికి త్వరగా పోషకాలు అందుతాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సూప్ తాగితే శరీరానికి వేడి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
ఫిష్ పాయ సూప్ తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ ఆరోగ్యకరమైన సూప్ సిద్ధం చేయవచ్చు. కావాల్సినవి – తాజా చేప ముక్కలు అర కేజీ, అల్లం పేస్ట్ ఒక స్పూన్, వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, నల్ల మిరియాల పొడి చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడ, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం అవసరమైనంత, నీరు కావాల్సిన మేరకు. తాజా చేపలు వాడితే సూప్ రుచి మరింత మెరుగ్గా ఉంటుంది.
సూప్ తయారీ విధానం కూడా చాలా ఈజీ. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. తర్వాత ఒక పాన్‌లో చేప ముక్కలను వేసి, అవి పూర్తిగా మునిగేలా నీరు పోసి గ్యాస్ మీద పెట్టాలి. చేపలు మెత్తగా ఉడికే వరకు మరిగించాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మళ్లీ మరిగించాలి. ఈ దశలో నీటిలో చేప రుచి పూర్తిగా కలిసేలా సుమారు 15–20 నిమిషాలు మరిగిస్తే సూప్‌కు మంచి ఫ్లేవర్ వస్తుంది. మంట మితంగా ఉండేలా చూసుకోవాలి.
చివరిగా సూప్‌ను వడగట్టి, అందులో ఉడికిన చేప ముక్కలను వేసుకోవచ్చు లేదా కేవలం సూప్ మాత్రమే కూడా తాగవచ్చు. పై నుంచి నల్ల మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసుకుంటే రుచి అదిరిపోతుంది. వేడి వేడిగా ఈ ఫిష్ పాయ సూప్ తాగితే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తాగితే జీర్ణక్రియ మెరుగవడంతో పాటు, మంచి నిద్ర కూడా పడుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అందుకే చలికాలంలోనే కాకుండా, బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఈ సూప్‌ను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.