Australia: ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మహిళకు డిపోర్టేషన్! ఆమెకు అండగా స్థానికులు!

Australia: కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా లో ఒక మహిళా పరిస్థితి కూడా అలాగే ఉంది. డాక్యుమెంట్ లో తప్పుల కారణంగా ఆమె ఇప్పుడు దేశం వీడిచి వెళ్ళే పరిస్థితి..

Published : 2026-04-09 15:20:00

తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూపులు..

ఆమెకు అండగా స్థానికుల పిటీషన్.. 

మయన్మార్‌లో 1980లలో జన్మించిన యింగ్-హ్సీ చౌ జీవితం అనుకోని మలుపు తిరిగింది. చైనీస్ వంశానికి చెందినప్పటికీ, అప్పటి మయన్మార్ ప్రభుత్వం పరిమితుల కారణంగా ఆమెకు చైనీస్ పేరు పెట్టుకునే అవకాశం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో పెరిగిన చౌ, 2002లో 18 ఏళ్ల వయసులో తైవాన్‌కు వెళ్లి అక్కడ పౌరసత్వం పొందింది. ఆ సమయంలోనే ఆమె తనకు నచ్చిన చైనీస్ పేరును స్వీకరించింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని అప్పట్లో ఆమె ఊహించలేదు.

2012లో చౌ మొదటిసారి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ పనిలో చేరింది. ఆ తర్వాత తిరిగి తైవాన్‌కు వెళ్లినా, 2014లో మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చి అక్కడే స్థిరపడింది. ఈ సమయంలో ఆమె బెన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిగా మారింది. కానీ అప్పట్లో చేసిన కొన్ని ప్రయాణాలు, పత్రాల విషయంలో జరిగిన చిన్న పొరపాట్లు ఇప్పుడు ఆమెకు పెద్ద సమస్యగా మారాయి.

చౌ తరఫు న్యాయవాది గార్డన్ చాంగ్ తెలిపిన వివరాల ప్రకారం, 2012లో ఆమె పాస్‌పోర్ట్ ఫారం నింపేటప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వడం మరిచిపోయింది. పాత పాస్‌పోర్ట్‌లో ఒక పేరు, కొత్త పాస్‌పోర్ట్‌లో మరో పేరు ఉండటంతో గందరగోళం ఏర్పడింది.

అదే సమయంలో, 2014లో మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు, తాను గతంలో అక్కడికి వచ్చిన విషయం ఫారంలో వెల్లడించలేదు. ఈ అంశాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియా హోం అఫైర్స్ శాఖ కీలకంగా పరిగణిస్తోంది. న్యాయవాది, “ఇది ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. కానీ అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం చౌ ను కొన్ని రోజుల్లోనే ఆస్ట్రేలియా నుంచి పంపించే పరిస్థితి నెలకొంది. ఆమెను తైవాన్‌కు పంపిస్తే, మళ్లీ ఆస్ట్రేలియా వీసా కోసం కనీసం మూడు సంవత్సరాలు వేచి ఉండాలి. అంతేకాకుండా, వీసా దొరుకుతుందనే హామీ లేదు. ఈ పరిస్థితి ఆమె కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

చౌ పెద్ద కుమారుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక బాధపడుతున్నాడు. “నాకు నా అమ్మతో ఇక్కడే ఉండాలని ఉంది. స్కూల్ మార్చుకోవాలని లేదు, నా ఫ్రెండ్స్‌ను వదిలేయాలని లేదు” అని అడుగుతున్నాడని చౌ వెల్లడించింది. ఆ ప్రశ్నలకు తాను సరైన సమాధానం చెప్పలేకపోతున్నానని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.

చౌ భర్త బెన్ కాక్ కూడా తన కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. తైవాన్‌లో కొత్త జీవితం ప్రారంభించడం అంత సులభం కాదని, “మాండరిన్ భాష కూడా నాకు తెలియదని, అక్కడ ఉద్యోగం ఎలా సంపాదించాలో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ మాకు ఇల్లు ఉంది, లోన్ ఉంది. ఆ అన్నింటినీ వదిలి వెళ్లడం చాలా కష్టం” అని చెప్పాడు.

ఈ ఘటనపై స్థానిక ప్రజలు స్పందిస్తున్నారు. ముర్రే బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన ప్రజలు చౌ కుటుంబం అక్కడే ఉండాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 3,000కు పైగా సంతకాలు నమోదయ్యాయి.

ఇక చౌ తరపు న్యాయవాది మరో పిటిషన్‌ను ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్‌కు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన జోక్యం చేసుకుని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

చిన్నపాటి డాక్యుమెంట్ ల పొరపాటు ఒక కుటుంబ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు చౌ కుటుంబం ఆశలు అన్నీ ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Spotlight

Read More →