నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం పై ప్రత్యేక వీడియో..
జర్మనీలోని హాంబర్గ్ మరియు ఫ్రాంక్ఫర్ట్ నగరాల్లో..
జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, హాంబర్గ్, జర్మనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై, “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాటతో సాంస్కృతిక వాతావరణం నెలకొంది.
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం, ముఖ్య ఘట్టాలు, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. ఆ వీడియో ద్వారా చంద్రబాబు తీసుకొచ్చిన మార్పులను పాల్గొన్నవారు గుర్తు చేసుకున్నారు.
అమరావతిని ఆంధ్రుల రాజధానిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంలో చంద్రబాబు చేసిన కృషిని వక్తలు ప్రత్యేకంగా కొనియాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ రచించిన “చంద్రబాబు నాయుడు X.0” పుస్తకాన్ని జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో అనువదించి ప్రతులను పంపిణీ చేశారు. జర్మన్ అనువాద పుస్తకాలను అక్కడి ప్రధాన నగరాల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని నిర్వాహకులు టిట్టు మద్దిపట్ల, శివశంకర్ లింగం తెలిపారు.
హాంబర్గ్ టీడీపీ బృందం నుండి డాక్టర్ శివశంకర్ లింగం, శశిధర్ ఏమిరెడ్డి, విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, శ్రీకాంత్ గోళ్ళ, రాజా పులిచర్ల, శివ కోలా, చైతన్య యలమంచి, యాగేష్, నాగేంద్ర కూతురు, వఝల చాణక్య, భరత్ శీలంనేని, లక్ష్మీ పెర్నీడు బొల్లెంపల్లి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హిల్దిస్ హైం, బ్రిమెన్ నగరాల నుండి కూడా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
ఇక ఫ్రాంక్ఫర్ట్ నగరంలో కూడా చంద్రబాబు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. కేక్ కట్ చేసి, బెలూన్లు ఎగురవేస్తూ ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా జర్మన్ తెలుగుదేశం నాయకుడు శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ చంద్రబాబు గొప్ప దార్శనికుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో పడిన తెలుగు జాతిని తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు తీసుకురావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నారని అన్నారు.
పవన్ కుర్ర మాట్లాడుతూ దేశ అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మొత్తంగా జర్మనీలోని తెలుగు ప్రజలు చంద్రబాబు జన్మదినాన్ని ఉత్సాహంగా, గౌరవంగా జరుపుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.